సీబీఐ అధికారులకు కీలక ఆదేశాలు… ఇక నుంచి ప్రతీ ఒక్కరూ

సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) సుబోధ్ కుమార్ జైస్వాల్ అధికారులకు, సిబ్బందికి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇకపై కార్యాలయంలోని అధికారులు జీన్స్, టీషర్టస్, స్పోర్టస్ షూస్, వేసుకోకూడదని స్పష్టం చేశారు. ఈ ఆదేశాలు తక్షణమే అమలులోకి వస్తాయని ఇకనుంచి ప్రతీ ఒక్కరూ వీటిని పాటించాలన్నారు. దీని ప్రకారం సీబీఐలో పని చేసే పురుషులు ఇకపై షర్టస్, ఫార్మల్ ప్యాంట్లు, ఫార్మల్ షూస్ వేసుకోవాలి. అలాగే నీట్‍గా షేవ్ చేసుకోవాలి. ఇక మహిళా అధికారులైతే చీరలు, సూట్లు, ఫార్మల్ షర్టస్, ప్యాంట్లు మాత్రమే వేసుకొని కార్యాలయాలకు రావాలి. ఈ మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించేలా చూడాలని దేశవ్యాప్తంగా ఉన్న సీబీఐ శాఖల అధిపతులకు తెలిపారు.
నిజానికి ఎప్పటి నుంచో ఇలాంటి డ్రెస్సింగ్ సీబీఐలో ఉన్నా.. గత కొన్నేళ్లుగా కొందరు క్యాజువల్స్ వేసుకోవడం ప్రారంభించారని, అయితే ఇన్ని రోజులూ వారిని ఎవరు ప్రశ్నించలేదని ఓ సీబీఐ అధికారి అన్నారు. గత వారమే సీబీఐ 33వ డైరెక్టర్‍గా బాధ్యతలు చేపట్టిన సుబోధ్.. రానున్న రోజుల్లో సీబీఐ పనితీరును మెరుగుపరిచేందుకు కొన్ని కీలక చర్యలు తీసుకోనున్నట్లు సీబీఐ వర్గాలు వెల్లడించాయి.