కేంద్ర ప్రభుత్వం గుడ్న్యూస్
పండగ వేళ కేంద్ర ప్రభుత్వ, రైల్వే ఉద్యోగులతో పాటు రైతులకు కేంద్రం గుడ్న్యూస్ చెప్పింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏను 4 శాతం, రైల్వే ఉద్యోగులకు బోనస్ చెల్లింపులకు ప్రధాని మోదీ నేతృత్వంలో జరిగిన కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఈ మేరకు ఆమోదం తెలిపింది. గోధమలకు కనీస మద్దతు ధరను క్వింటాకు రూ.150 పెంచుతూ నిర్ణయం తీసుకుంది. కేబినెట్ సమావేశం అనంతరం నిర్ణయాలను కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మీడియాకు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డియర్నెస్ అలవెన్సును (డీఏ) 4 శాతం పెంచేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు ప్రస్తుతం ఇస్తున్న డీఏ 42 శాతం నుంచి 46 శాతానికి పెరగనుంది. జులై 1 నుంచి పెరిగిన డీఏ వర్తించనుంది. 7వ వేతన సంఘం సిఫార్సుల మేరకు కేంద్ర మంత్రివర్గం ఈ నిర్ణయం తీసుకుంది. డీఏ పెంపు నిర్ణయంతో 48.67 లక్షల మంది ఉద్యోగులకు, 67.95 లక్షల మంది పెన్షనర్లకు ప్రయోజనం చేకూరనుంది అని తెలిపారు.













