ఏడు అసెంబ్లీ స్థానాల్లో ఉప ఎన్నికలకు .. షెడ్యూల్ విడుదల
దేశవ్యాప్తంగా ఆరు రాష్ట్రాల్లో పలు కారణాల వల్ల ఖాళీ అయిన ఏడు అసెంబ్లీ స్థానాల్లో ఉప ఎన్నికలకు షెడ్యూల్ ఖరారైంది. కేరళ మాజీ సీఎం ఊమెన్ చాందీ మరణంతో ఖాళీ అయిన పూతుపల్లి సీటుతో పాటు ఏడుచోట్ల ఉప ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. ఝార్ఖండ్‌లో డుమ్రీ, త్రిపురలోని బోక్సానగర్, బెంగాల్‌లోని ధూప్‌గురి, ఉత్తరాఖండ్‌లోని బాగేశ్వర్‌లలో ఎమ్మెల్యేలు మరణంతో ఎన్నికలు నిర్వహిస్తుండగా, యూపీలోని ఘోసి, త్రిపురలోని ధన్పూర్ స్థానాల్లో ఎమ్మెల్యేల రాజీనామాతో ఆయా స్థానాల్లో ఉప ఎన్నికలు అనివార్యమైనట్టు సీఈఓ ప్రకటనలో తెలిపింది. ఆరు రాష్ట్రాలోని మొత్తం ఏడు నియోజకవర్గాల్లో ఆగస్టు 10న గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ఆగస్టు 17 వరకు నామినేషన్లు స్వీకరించి, ఆగస్టు 18న నామినేషన్ల పరిశీలన చేపడతారు. నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు ఆగస్టు 21గా నిర్ణయించారు. సెప్టెంబర్ 5న పోలింగ్ నిర్వహించి 8న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.













