ఉప ఎన్నికల్లో బీజేపీ హవా
దేశవ్యాప్తంగా ఈ నెల 3న జరిగిన ఉప ఎన్నికలకు సంబంధించి వెలువడిన ఫలితాల్లో బీజేపీ మెజార్టీ స్థానాలను దక్కించుకుంది. మొత్తం ఆరు రాష్ట్రాల్లో ఏడు శాసనసభ నియోజకవర్గాలకు ఎన్నికలు జరగ్గా వాటిలో నాలుగు కమలదళం ఖాతాలో పడ్డాయి. మిగిలిన మూడు శివసేన ఆర్జేడీ, టీఆర్ఎస్లకు దక్కాయి. తెలంగాణలో మునుగోడులో అధికార టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి బీజేపీలో చేరడంతో ఇక్కడ ఎన్నిక అనివార్యమైంది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని గోలా గోకర్ణ్‌నాథ్ శాసనసభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ పట్టు నిలుపుకుంది. సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి వినయ్ తివారీపై బీజేపీ అభ్యర్థి అమన్గిరి 34,298 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఆయన 1,24,810 ఓట్లు సాధించగా, ఎస్పీ అభ్యర్థి వినయ్ తివారీకి 90,512 ఓట్లు వచ్చాయి. హరియాణాలోని అధంపూర్ శాసనసభ స్థానం నుంచి మాజీ ముఖ్యమంత్రి భజన్‌లాల్ మనవడు, బీజేపీ అభ్యర్థి భవ్య బిష్ణోయ్ విజయం సాధించారు. ఆయన కాంగ్రెస్ అభ్యర్థి జై ప్రకాశ్‌ను 15,714 ఓట్ల తేడాతో ఓడించారు.
మహారాష్ట్రలోని అంధేరి తూర్పు నియోజకవర్గంలో శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ ఠాక్రే) అభ్యర్థి రుతుజా లట్కే విజయకేతనం ఎగురవేశారు. రుతుజా ఇక్కడ పోటీ చేసి గెలుపొందారు. ఆమెకు 66,773 ఓట్లు రాగా ఆ తర్వాత స్థానంలో నోటాకు 12,806 కోట్లు రావడం విశేషం. బీజేపీ అభ్యర్థి ఈ ఎన్నికలో నామిషన్‌ను ఉపసంహరించుకున్నారు. ఒడిశాలో ధామ్‌నగర్‌లో బీజేపీ అభ్యర్థి సూర్యభన్షి సూరజ్ అధికార బీజేడీ అభ్యర్థి అభంతి దాస్‌ను 9,881తేడాతో ఓడిరచారు. బిహార్‌లో బీజేపీ, అర్జేడీ చెరొక స్థానంలో గెలపొందాయి. గోపాల్‌గంజ్ నియోజవర్గంలో ఆర్జేడీ అభ్యర్థి మోహన్ గుప్తాపై బీజేపీ అభ్యర్థి కుసుమ్ దేవీ 1,789 ఓట్ల తేడాతో విజయం సాధించారు. మోకామో నియోజకవర్గంలో ఆర్జేడీ అభ్యర్థి నీలం దేవీ.. బీజేపీ అభ్యర్థి సోనమ్ దేవీపై 16,707 ఓట్ల తేడాతో గెలుపొందారు.













