తొలిదశలో గుర్తిస్తే, జయించవచ్చు .. ఏసీఎస్ సదస్సులో డాక్టర్ రఘురాం
రొమ్ము క్యాన్సర్‌ను తొలిదశలో గుర్తిస్తే జబ్బును నయం చేయవచ్చనీ, అవగాహన లేకనే ఏటా సుమారు 60 శాతం మంది వ్యాధి ముదిరాక చికిత్సకు వస్తున్నారని రొమ్ము క్యాన్సర్ శస్త్రచికిత్స నిపుణుడు, కిమ్స్ ఉషా లక్ష్మి రొమ్ము వ్యాధుల కేంద్రం సంచాలకుడు డాక్టర్ రఘురాం తెలిపారు. వైద్య వ్యవస్థలో అంతర్జాతీయంగా పేరొందిన, అతి ప్రతిష్టాత్మక సంస్థల్లో ఒకటైన అమెరికన్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ (ఏసీఎస్) 107వ వార్షికోత్సవం సదస్సులో డాక్టర్ రఘురాం దృశ్య మాద్యమంలో ప్రసంగించారు. వ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించడమే లక్ష్యంగా తమ మాతృమూర్తి పేరిట భారత్‌లో 14 ఏళ్లుగా వినూత్న కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా 140 దేశాల నుంచి 84 వేల మంది వైద్యనిపుణులు ఈ సంస్థలో సభ్యులుగా ఉన్నారు. రొమ్ము క్యాన్సర్‌ను గుర్తించడం, అవగాహన, తొలిదశలో చికిత్స, రొమ్ము శస్త్రచికిత్స నిపుణుల సంస్థను స్థాపించడం తదితర అంశాలపై సుమారు 55 నిమిషాల పాటు వార్షికోత్సవంలో మాట్లాడే అవకాశం ఈయనకు దక్కింది. ఈ సంవత్సరం అమెరికా వెలుపల దేశాలకు చెందిన నిపుణుల్లో సదస్సులో ప్రనసంగించే అవకాశం దక్కిన ఏకైన వైద్యుడు డాక్టర్ రఘురాం.













