23 ఏళ్లుగా ప్రభుత్వాధినేతగా ఉన్న.. ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవు : మోదీ
రానున్న లోక్సభ ఎన్నికల్లో 370కు పైగా సీట్లు గెలవడమే జనసంఘ్ వ్యవస్థాపకుడు డా.శ్యామాప్రసాద్ ముఖర్జీకి నిజమైన నివాళి అని బీజేపీ శ్రేణులనుద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. బీజేపీ జాతీయ మండలి సమావేశాల ప్రారంభానికి ముందు నిర్వహించిన పార్టీ జాతీయ పదాధికారుల సమావేశంలో ప్రధాని మోదీ ప్రసంగించారు. పేదల సంక్షేమం, దేశాభివృద్ది, అంతర్జాతీయ వేదికపై పెరిగిన భారత ప్రాభవం తదితర అంశాల చుట్టూ లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని కేంద్రీకృతం చేయాలని పిలుపునిచ్చారు. గతంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా, ప్రస్తుతం దేశ ప్రధానిగా కలిపి దాదాపు 23 ఏళ్లుగా ప్రభుత్వాధినేతగా ఉన్నానని, ఇంత సుదీర్ఘకాలంలో తనపై ఎలాంటి అవినీతి ఆరోపణలు రాలేవని మోదీ పేర్కొన్నారు. ఇది ఆరోపణల రహిత, వికాసంతో కూడిన కాలమని చెప్పారు.













