‘సోనార్ బాంగ్లా’ కు కట్టుబడే ఉన్నాం : మోదీ
‘సోనార్ బాంగ్లా’ కు తాము కట్టుబడే ఉన్నామని ప్రధాని నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. బెంగాల్ పరివర్తనకు ప్రజలు సిద్ధంగానే ఉన్నారని పేర్కొన్నారు. నాలుగు దశాబ్దాల్లో ఈసారి, బెంగాల్ ప్రజలు నిష్పాక్షిక పాలన కోసం ఓటు వేశారని, బెంగాల్ ప్రజలు ఉపాధి, జీవన సౌలభ్యం, వ్యాపారం చేసే సౌలభ్యాల కోసం ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు. బెంగాల్ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని మోదీ బెంగాల్ ప్రజలనుద్దేశించి వర్చువల్ గా మాట్లాడారు. బెంగాల్లో మార్పు వల్ల మాత్రమే ఇది సాధ్యమవుతుందని, బెంగాల్లో మార్పు తెస్తామని తాము హామీ ఇచ్చామని, కట్టుబడి కూడా ఉన్నామని మోదీ స్పష్టం చేశారు. అభివృద్ధి, భద్రత, శాంతి, కార్మిక గౌరవం కోసం బెంగాల్ తాపత్రయ పడుతోందని, దానిని నెరవేర్చడానికి తాము సిద్ధంగానే ఉన్నామని తెలిపారు. పరివర్తన అంటే కేవలం ముఖ్యమంత్రులు మారడం కాదని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసే ప్రభుత్వాలు రావడమన్నారు.
అభివృద్ధి, ఉపాధి, పరిశ్రమలు, మౌలిక సదుపాయాల కల్పన, పేదల జీవితాలు మారడం… ఇదే సోనార్ బంగ్లా అని మోదీ వివరించారు. పేదల అవసరాలను దృష్టిలో ఉంచుకొని, తాము నేరుగా పేదల అకౌంట్లలోకి డబ్బులు వేస్తున్నామని, కానీ సిండికేట్ల కారణంగా బెంగాల్ ప్రజలకు అవి చేరడం లేదని మండిపడ్డారు. సిండికేట్లు, అక్రమ వలసదారులు బెంగాల్ అభివృద్ధి నిరోధకులుగా మారని మండిపడ్డారు.
భారత్‌కు రికార్డు స్థాయిలో పెట్టుబడులు వస్తాయని, ఇందులో సింహ భాగం బెంగాల్‌కే వినియోగిస్తామని మోదీ హామీ ఇచ్చారు. బెంగాల్ ప్రజల కలలను నెరవేర్చడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. దేశంలో కోవిడ్ విజృంభణ నేపథ్యంలో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాల్లో పాల్గొన్నానని, అందుకే బెంగాల్‌కు రాలేకపోయానని, అందుకు బెంగాల్ ప్రజలు క్షమించాలని మోదీ కోరారు.













