ఉచిత కోవిడ్ వ్యాక్సిన్ హామి ఇచ్చిన బిజెపి…మండిపడిన ప్రతిపక్షాలు
వ్యాక్సిన్ రాజకీయంలో బీహార్ ఎన్నికలు
ప్రత్యర్థులు కంటి రెప్ప వాల్చే లోపలే దెబ్బ తీయడమనేది రాజకీయ ఎత్తుగడ. ఊహించని విధంగా శత్రువును దెబ్బతీయడం రాజకీయ చదరంగంలో నిత్య నూతనం. సరిగ్గా యూపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీ నోట్ల రద్దు అని బాంబు పేల్చి… ప్రత్యర్థులు ఊహించని దెబ్బ కొట్టింది. ఇప్పుడు బిహార్ ఎన్నికల సమయంలోనూ బీజేపీ అదే విధానాన్ని అవలంబించింది. ‘కోవిడ్ వ్యాక్సిన్ ను ప్రజలందరికీ ఉచితంగా అందిస్తామని” బీజేపీ ప్రకటించింది. ఈ ప్రకటనే ప్రస్తుతం అన్ని రాష్ట్రాలను, పార్టీలను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఇప్పటి వరకూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ‘ప్రయారిటీ బేస్’ ఆధారంగా వ్యాక్సిన్ ను పంపిణీ చేయాలని అనధికార ఒప్పందం కుదిరింది. అంటే ఏ రాష్ట్రంలో అయితే కోవిడ్ తీవ్రత అధికంగా ఉంటుందో ఆ రాష్ట్రానికి మొదట వ్యాక్సిన్‌ను సరఫరా చేయాలని భావించారు. కానీ బిహార్ వేదికగా ఉచితంగా ఇస్తామని ఎందుకు ప్రకటించారని కేంద్ర ప్రభుత్వంపై మిగితా రాష్ట్రాలు ఒంటి కాలుతో లేస్తున్నాయి. సమాఖ్య స్ఫూర్తికే ఇలాంటి ప్రకటనలు విరుద్ధమని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. ఇలా ప్రకటన చేయడం రాష్ట్ర ప్రభుత్వాలను చిక్కుల్లోకి నెట్టేయడమేనని అంటున్నారు. రాష్ట్రాలు సొంతంగా టీకాలు కొనుగోలు చేసుకోవాల్సిందేనన్న సంకేతాలను కేంద్రం ఇస్తోందని రాష్ట్ర ప్రభుత్వాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. అయితే వ్యాక్సిన్ సరఫరాపై కేంద్రం నేత త్వంలో ఓ టాస్క్ ఫోర్స్ ఏర్పాటైంది. ఏ రాష్ట్రం కూడా సొంతంగా వ్యాక్సిన్ కొనుగోలుకు ప్రయత్నాలు చేయరాదని సంబంధిత టాస్క్ ఫోర్స్ ఇప్పటికే పలుమార్లు రాష్ట్రాలను హెచ్చరించింది. ఓ టాస్క్‌ఫోర్స్ హెచ్చరించినా…. కేంద్రం వేస్తున్న అడుగులు చూస్తే మాత్రం తమ సొంత ప్రయత్నాలు చేసుకోవాలన్న సంకేతాలనే ఇస్తోందని కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు బిహార్ వేదికగా కమలం వేసిన అడుగును మిగితా రాష్ట్రాలు కూడా జాగ్రత్తగా గమనిస్తున్నాయి. వచ్చే యేడాదిలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోయే రాష్ట్రాలైతే ఈ అడుగును చాలా సీరియస్ గా తీసుకున్నాయి. అన్నాడీఎంకే నేత త్వంలోని తమిళనాడు, బీజేపీ నేత త్వంలోని మధ్యప్రదేశ్ ప్రభుత్వాలు తాము కూడా ఉచితంగానే కోవిడ్ వ్యాక్సిన్ ను పంపిణీ చేస్తామని ప్రకటించేశాయి. మరిన్ని రాష్ట్రాలు కూడా ఇదే మార్గంలో ఉన్నట్లు సమాచారం. మామూలుగా అయితే ఉచితంగా వ్యాక్సిన్లను అందించే ప్రక్రియను కేంద్ర ఆరోగ్య మిషన్ నేత త్వంలో ఉన్న ”ఇమ్యూనైజేషన్ ప్రోగ్రామ్” కింద అందిస్తూ ఉంటారు. దేశంలోని జనాభా అంతటికి కూడా ఈ ప్రోగ్రామ్ కిందనే వ్యాక్సిన్లను అందించాల్సి ఉంటుంది. గర్భిణీలు, చిన్న పిల్లలకు సంవత్సరాంతం ఈ ప్రోగ్రాం కిందనే టీకాలను ఉచితంగా అందిస్తుంటారు. పోలియో, డిఫ్తీరియా, పెర్టుసిస్, టెటానస్, రుబెల్లా, క్షయ, హెపటైటిస్ బి… ఇలా తొమ్మిది రకాల వ్యాధులకు యూఐపీ ప్రోగ్రాం కిందనే కేంద్రం ఉచితంగా టీకాలను అందిస్తోంది. ఇలా చేయడం ద్వారానే ఎలాంటి వివక్షా లేకుండా అన్ని రాష్ట్రాలకు, పౌరులందరికీ వ్యాక్సిన్ అందుతుందని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పేర్కొంటున్నాయి.
అయితే వ్యవహారం ముదిరిన నేపథ్యంలో బీజేపీ స్పందించింది. బీజేపీ ఐటీ సెల్ హెడ్ అమిత్ మాలవ్యా మాట్లాడుతూ… ”ఉచితంగా వ్యాక్సిన్ ఇస్తామని మా మేనిఫెస్టోలో హామీఇచ్చాం. మిగితా అన్ని పథకాల లాగే… కేంద్రం చాలా తక్కువ ధరలోనే అన్ని రాష్ట్రాలకు పంపిణీ చేస్తుంది. వాటిని అంతే ధరకు ఇవ్వాలా… లేదా.. కాస్త రేటును పెంచి ఇవ్వాలా అన్నది ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించుకోవాల్సిన అంశం. ఆరోగ్యం అనేది రాష్ట్ర జాబితాలో ఉంది. బిహార్‌కు చెందిన బీజేపీ రాష్ట్ర శాఖ మాత్రం ఈ వ్యాక్సిన్ ను ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించుకుంది. అంతే. అందులో పెద్ద వివాదమే లేదు.” అని అమిత్ మాలవ్యా పేర్కొన్నారు. అయితే దీనిపై కాంగ్రెస్ పాలిత రాష్ట్రమైన చత్తీస్‌గఢ్ ఆరోగ్య మంత్రి టీ.ఎస్. సింగ్ ఘాటుగా స్పందించారు. ”టీకాలు కొనుగోలు చేసుకోవాలని రాష్ట్రాలకు కేంద్రమేమీ చెప్పలేదు. దానికయ్యే ఖర్చును చెల్లించమని మమ్మల్ని అడిగితే మేము చెల్లిస్తాం. అది సమస్యే కాదు. కానీ టీకాలు జనాభాకు సరిపోయే విధంగా ఉండాలి.అయినా ఓ రాష్ట్రానికి మాత్రమే వ్యాక్సిన్ హామీ ఇవ్వడం కుదరదు. ఈ ప్రకటనను కేంద్ర ఎన్నికల సంఘం పరిగణనలోకి తీసుకోవాల్సిందే.” అని టీకే సింగ్ డిమాండ్ చేశారు. ఇక చూడాలి… ఈ ప్రకటనలో నేపథ్యంలో వ్యాక్సిన్ రాజకీయం ఏ మలుపు తిరుగుతుందో? మరెన్ని రాష్ట్రాలు, పార్టీలు ”ఉచిత” వ్యాక్సిన్ హామీలిస్తాయో?…వేచి చూడాల్సిందే.













