కర్నాటక సంక్షోభ సమయంలో… వింత సమాధానం ఇచ్చిన ఇన్చార్జీ అరుణ్ సింగ్
కర్నాటకలో సీఎం యడియూరప్పపై 10 మంది ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ముఖ్యంగా గతంలో యడియూరప్పకు అత్యంత సన్నిహితుడిగా ఉన్న కేఎస్ ఈశ్వరప్ప ఇప్పుడు తిరుగుబాటు జెండా ఎగరేస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం యడియూరప్ప మార్పు అనివార్యమని వార్తలొచ్చాయి. వీటిని పరిగణనలోకి తీసుకున్న అధిష్ఠానం, రాష్ట్రంలోని పరిస్థితులను అధ్యయనం చేయడానికి ఆ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి అరుణ్ సింగ్ను బెంగళూరుకు పంపింది. అధిష్ఠానం సూచించడంతో ఇన్చార్జి అరుణ్ సింగ్ బెంగళూరుకు వచ్చారు. ఈ పర్యటన సందర్భంగా అరుణ్ సింగ్ సీఎం యడియూరప్పతో భేటీ కానున్నారు. ఈ భేటీ ముగిసిన తర్వాత అసంతృప్త ఎమ్మెల్యేలతో భేటీ కానున్నారు. వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని, అధిష్ఠానానికి నివేదించనున్నారు. అయితే బెంగళూరు పర్యటనకు వచ్చిన సందర్భంగా విలేకరులు అరుణ్ సింగ్ను కలిశారు. ఈ సందర్భంగా అరుణ్ సింగ్ విలేకరులకు ఓ వింత సమాధానం ఇచ్చారు.
‘‘కోవిడ్ సహాయాన్ని మా పార్టీ కార్యకర్తలు రాష్ట్రంలో ఉధృతంగా చేస్తున్నారు. నిరంతరాయంగా కొనసాగిస్తూనే ఉన్నారు. దానిపై సమీక్ష చేయడానికి ఇక్కడికి వచ్చా. అంతేకాకుండా సింగిల్ యూజ్ ప్టాసిక్తో పాటు అంతర్జాతీయ యోగాడే లాంటి విషయాలను నేతలతో మాట్లాడడానికి ఇక్కడికి వచ్చా’’ అని అరుణ్ సింగ్ వింత సమాధానం ఇచ్చారు. మరోవైపు పార్టీలో ఎలాంటి అసంతృప్తీ లేదని అరుణ్ సింగ్ ప్రకటించారు. ఎమ్మెల్యేలంతా ఏకంగానే ఉన్నారని, సీఎం యడియూరప్ప నేతృత్వంలో పనిచేయడానికి కూడా సిద్ధంగానే ఉన్నారని అరుణ్ సింగ్ పేర్కొన్నారు.













