దేశం పరువు తీసే ప్రయత్నం.. రాహుల్‌పై మండిపడ్డ బీజేపీ నేత రవిశంకర్ ప్రసాద్
విదేశాలకు వెళ్లి మాతృదేశం పరువు తీసేలా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రవర్తిస్తున్నారని బీజేపీ మండిపడుతోంది. ప్రస్తుతం యూకేలో ఉన్న రాహుల్.. కేంబ్రిడ్జి ప్రసంగం నుంచి భారత్‌పై, ఇక్కడి బీజేపీ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రాహుల్‌పై బీజేపీ సీనియర్ నేత రవిశంకర్ ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత దేశ ప్రజాస్వామ్యం, రాజనీతి, పార్లమెంటు, న్యాయ వ్యవస్థలను అవమానించేలా లండన్‌లో రాహుల్ మాట్లాడుతున్నారని విమర్శించారు. దేశ అంతర్గత విషయాల్లో వేళ్లు పెట్టాలని విదేశాలను కోరుతున్నారంటే మండిపడ్డారు. భారత్‌లో మళ్లీ ప్రజాస్వామ్య పునరుద్ధరణ జరగాలంటే అమెరికా, యూరోపియన్ యూనియన్ జోక్యం చేసుకోవాలని రాహుల్ చెప్పడం చాలా బాధ్యతారాహిత్యం అని, ఇలాంటి వ్యాఖ్యలకు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తుందా? అని నిలదీశారు. రాహుల్ వ్యాఖ్యలను కాంగ్రెస్ లీడర్లు సోనియాగాంధీ, మల్లికార్జున ఖర్గే సమర్థిస్తారా? అని రవిశంకర్ ప్రసాద్ సూటిగా ప్రశ్నించారు. ఒకవేళ ఈ వ్యాఖ్యలను వాళ్లు సమర్థించకపోతే… రాహుల్ వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదని వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు. అలాగే ఆరెస్సెస్‌ను ‘ముస్లిం బ్రదర్ హుడ్’ తో రాహుల్ పోల్చడం చాలా దారుణమని, ఆరెస్సెస్ ఒక జాతీయవాద సంస్థ అని పేర్కొన్నారు.













