రాహుల్‌కు పోటీగా 242 కేసుల్లో నిందితుడిని బరిలోకి దింపిన బీజేపీ
లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో అన్ని పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. ఈ క్రమంలోనే బీజేపీ కూడా తమ అభ్యర్థులను బరిలోకి దింపే పనిలో బిజీగా ఉంది. ఇటీవల కేరళ నుంచి పోటీ చేయబోతున్న తమ లోక్‌సభ అభ్యర్థుల జాబితాను ప్రకటించిన బీజేపీ.. అందులో తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కే సురేంద్రన్ వాయనాడ్ నుంచి పోటీ చేస్తున్నట్లు ప్రకటించింది. ఇంతకవరకు బాగానే ఉన్నా.. తాజాగా బీజేపీ రాష్ట్ర శాఖ కే సురేందర్ గురించి ఓ కీలక అంశాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసి అందరికీ షాకిచ్చింది.
కేరళలోని వాయనాడ్ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ కీలక నేత, పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కే సురేంద్రన్ పోటీ చేస్తున్నారు. అయితే తాజాగా సురేంద్రన్‌పై ఉన్న కేసుల వివరాలను కేరళ బీజేపీ తమ అధికారిక ఎక్స్ ఖాతాలో షేర్ చేసింది. సదరు పోస్ట్‌లో పేర్కొన్న సమాచారం ప్రకారం.. సురేంద్రన్‌పై అక్షరాలా 242 కేసులున్నాయి.
కాగా.. సురేంద్రన్‌పై ఉన్న కేసులపై స్పందించిన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జార్జ్ కురియన్.. ఆ కేసుల్లో అత్యధికంగా 2018లో శబరిమల నిరసనలకు సంబంధించినవని తెలిపారు. ఆ సమయంలోనే ఆయనే 237 కేసులు నమోదయ్యాయని, ఆ తర్వాత పార్టీ నిర్వహించిన నిరసనల సమయంలో మరో 5 కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. ఒక్క సురేంద్రన్ మాత్రమే కాదు.. బీజేపీ ఎర్నాకుళం నియోజకవర్గ అభ్యర్థి కేఎస్ రాధాకృష్ణన్‌పై కూడా దాదాపు 211 కేసులున్నాయి. అలాగే మరో అభ్యర్థి శోభా సురేంద్రన్‌పై కూడా 200కు పైగా కేసులున్నాయి.
సురేంద్రన్, రాధాకృష్ణన్, ఆ పార్టీ అలప్పుజ అభ్యర్థి శోభా సురేంద్రన్, వటకర అభ్యర్థి ప్రఫుల్ కృష్ణలపై ఉన్న కేసుల వివరాలను బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ ట్వీట్ చేశారు. ‘భారత్‌లోని కొన్ని ప్రాంతాల్లో జాతీయవాదిగా ఉండటం చాలా కష్టం, భారత్‌లో ఇది రోజువారీ పోరాటం. కానీ ఆ పోరాటం చాలా విలువైనది. అందుకు నిదర్శనమే వాయనాడ్ నుంచి పోటీ చేస్తున్న సురేంద్రన్. ఒక వ్యక్తి.. వందల కేసులు’ అంటూ ఆ పోస్ట్‌లో రాసుకొచ్చారు.













