అంబానీ ఖాతాలో మరో రికార్డు
రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) అధినేత, ఆసియా కుబేరుడు ముకేశ్ అంబానీ ఖాతాలో మరో రికార్డు వచ్చి చేరింది. ప్రపంచ టాప్ 10 కుబేరుల జాబితాలో ఆయన చోటు దక్కించుకున్నారు. తాజాగా ప్రఖ్యాత బ్లూంబర్గ్ సంస్థ విడుదల చేసిన ప్రపంచ కుబేరుల జాబితాలో ముకేశ్ అంబానీకి స్థానం లభించింది. బ్లూంబర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ టాప్ 10 జాబితాలో ఆయనకు 9వ స్థానం దక్కింది. ఆయన ఆస్తుల విలువ మొత్తం 64.5 బిలియన్ డాలర్లుగా నమోదైంది. ఆసియా ఖండం నుంచి ఏకైక వ్యక్తిగా ముకేశ్ అంబానీ ఈ జాబితాలో చోటు సంపాదించుకున్నారు. ప్రపంచ సంపన్నుల జాబితాలో చోటు దక్కించుకునే క్రమంలో ముకేశ్, ఒరాకిల్ కార్పొరేషన్ అధినేత లారీ ఎల్లిసన్, ఫ్రాన్స్‌కు చెందిన ఫ్రాంకోయిస్ అనే సంపన్న మహిళను అధిగమించి 9వ స్థానానికి చేరుకున్నారు. ఈ జాబితాలో అగ్రస్థానంలో అమెజాన్ సీఈఓ జెఫ్ బెజోస్ ఉన్నారు. ఆ తరువాత రెండు, మూడు స్థానాల్లో మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్, ఫేస్బుక్ అధినేత మార్క్ జుకర్ బర్గ్‌లు ఉన్నారు.













