బిహార్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న మేధావులు
బీహార్‌లో జరుగుతున్న ఎన్నికల్లో తమ సత్తా చూపించేందుకు మేధావులు ముందుకు వచ్చారు. ఇన్నాళ్ళు ఎన్నికల్లో పోటీలకు పెద్దగా సుముఖత చూపించని విద్యావంతులు ఈసారి ఎన్నికల్లో తమ సత్తా చాటేందుకు సన్నద్ధమయ్యారు. గతంలో బీహార్ ఎన్నికల్లో పోటీ చేసేవారి అర్హతను పరిశీలిస్తే చాలామంది క్రిమినల్ రికార్డులు కలిగి ఉన్నవారే కనిపిస్తారు. కాని ఈసారి జరిగే ఎన్నికల్లో విద్యావంతులు ముందుకురావడం చాలామందికి సంతోషాన్ని కలిగిస్తోంది. ఈ ఎన్నికల్లో పోటీ చేసే విద్యావంతుల్లో ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయ పూర్వ విద్యార్థి.. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి మాస్టర్స్ చేసినవాళ్ళు, ఎలక్ట్రానిక్స్ కంపెనీలో మాజీ హెచ్ఆర్ హెడ్.. ఐడీబీఐకి మాజీ ఆర్థిక సలహాదారు.. ఫ్యాషన్ డిజైనర్.. కామన్వెల్త్ షూటింగ్ బంగారు పతక విజేతను పొందిన పలువురు ఈ ఎన్నికల్లో సత్తా చాటనున్నారు. ఈ నెల 28న జరిగే తొలిదశ ఎన్నికల్లో తమ అదృష్టాన్ని వారు పరీక్షించుకుంటున్నారు.
మార్కెటింగ్‌లో ఎంబీఏ పూర్తి చేసిన 42 ఏళ్ల షాలినీ మిశ్రా ఫరీదాబాద్‌లో పని చేశారు. ఎలక్ట్రానిక్స్ కంపెనీకి హెచ్ఆర్ హెడ్ స్థాయికి ఎదిగారు. ప్రస్తుతం ఆమె రాజకీయాల వైపు మళ్లారు. ప్రస్తుతం తూర్పు చంపారన్‌లోని కేసరి స్థానం నుంచి జనతాదళ్ (యునైటెడ్) అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. ఈసారి ఎన్నికల్లో మండల్ కమిషన్ ఫేమ్ బీపీ మండల్ మనుమడు నిఖిల్ మండల్ (45) తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. మాస్టర్స్ ఆఫ్ లా చేసిన తర్వాత నిఖిల్ కార్పొరేట్ రంగంలో పని చేశారు. ఐడీబీఐకి ఆర్థిక సలహాదారుగా ఉన్నారు. మాధేపుర నుంచి జేడీ(యూ) అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. బిహార్ ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న మరో యువ మేధావి మనీష్ బారియార్ (42). బంకిపూర్ నుంచి పోటీ చేస్తున్నారు. బారియార్ న్యూఢిల్లీలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ నుంచి ఎంబీఏ పూర్తి చేశారు.
అలాగే ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థి. రాజకీయ జీవితం ప్రారంభించే ముందు పాట్నాలోని ఓ ప్రైవేటు ఇనిస్టిట్యూట్‌లో మేనేజ్మెంట్ బోధించారు. సస్సెక్స్ విశ్వవిద్యాలయం నుంచి డెవలప్మెంట్ స్టడీస్‌లో మాస్టర్స్ పూర్తి చేశారు పుష్పమ్ ప్రియా చౌదరి. అనంతరం ఆమె లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్ నుంచి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో మరొక మాస్టర్స్ కోర్సు పూర్తి చేశారు. పుష్పమ్ ప్రస్తుతం బంకీపూర్ నియోజకవర్గం నుంచి బరిలో ఉన్నారు. మాజీ ఐఏఎస్ అధికారి భార్య రితు జైస్వాల్ (35). ఎన్నికలకు కొత్త కాదు. రితు ప్రస్తుతం సీతామార్హిలోని సింగ్‌వాహిని గ్రామానికి చెందిన ముఖియా పరిహార్ నియోజకవర్గం నుంచి రాష్ట్రీయ జనతాదళ్ తరఫున పోటీ చేస్తున్నారు. 1995 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అరుణ్ కుమార్‌తో వివాహమైంది. ప్రస్తుతం బిహార్‌లో సామాజిక సేవ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. 2014 ఎన్నికల్లో ముఖియా విజయం సాధించిన సంగతి తెలిసిందే. బహిరంగ రహిత మరుగుదొడ్లు, రోడ్లు, సోలార్ లైట్లు, వాటర్ పంపులు, కమ్యూనిటీ బయోగ్యాస్ కోసం చేసిన క•షికి ఆమె గత సంవత్సరం ప్రతిష్టాత్మక దీన్ దయాల్ ఉపాధ్యాయ పంచాయతీ స్వశక్తికరన్ పురస్కార్‌ను ఆమె అందుకున్నారు. కామన్వెల్త్ క్రీడల్లో షూటింగ్ విభాగంలో బంగారు పతకం సాధించిన శ్రేయాసి సింగ్ (29) ఈ సారి అసెంబ్లీలో అడుగుపెట్టాలని చూస్తున్నారు. ఆమె ఇటీవల బీజేపీలో చేరారు. ఢిల్లీలోని హన్స్‌రాజ్ కాలేజీ పట్టభద్రురాలు. అలాగే ప్రైవేటు విశ్వవిద్యాలయంలో ఎంబీఏ చేశారు. షూటింగ్ విభాగంలో భారత్ తరఫున పాల్గొని కామన్వెల్త్ క్రీడల్లో బంగారు పతకం సాధించిన ఆమె రాజకీయాల్లో మార్పును తీసుకువచ్చేందుకు ముందుకు వచ్చారు. ఫ్యాషన్ డిజైనర్ చేతన్ ఆనంద్ కూడా షియోహార్ అసెంబ్లీ స్థానం నుంచి ఆర్జేడీ టికెట్‌పై పోటీ చేస్తున్నారు. మహారాష్ట్ర పూణేలోని ఓ ఇనిస్టిట్యూట్ నుంచి ఇండస్ట్రియల్ అండ్ టెక్స్‌టైన్ డిజైనింగ్ పూర్తి చేశారు. కొద్ది కాలంగా సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్న ఆయన ప్రస్తుతం రాజకీయాల్లోకి వచ్చారు. ఆర్జేడీలో చేరి ఈ సారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఈసారి ఎన్నికల్లో ఉన్నత విద్యావంతులు పోటీ చేస్తుండటం రాజకీయాల్లో ఓ మలుపుగా చెప్పవచ్చు. కాగా ఈ ఉన్నత విద్యావంతులను ప్రజలు ఎంతవరకు ఆదరిస్తారన్నది ఎన్నికల ఫలితాల వరకు వేచి చూడాల్సి ఉంది.













