తమిళనాడులో శ్రీవారి ఆలయానికి భూమిపూజ
తమిళనాడు రాష్ట్రంలోని ఉల్లందూర్‌పేటలో శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమానికి తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి, తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్ సుబ్బారెడ్డి, స్థానిక ఎమ్మెల్యే కుమారగురు దంపతులు హాజరయ్యారు. అర్చకులు మంత్రోచ్ఛారణల నడుమ భూమి పూజ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఉల్లందూర్పేట ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు సభ్యుడైన కుమారగురు ఇటీవల శ్రీవారి ఆలయ నిర్మాణం కోసం 3 ఎకరాల 98 సెంట్ల భూమి టీటీడీకి విరాళంగా అందించారు. దీంతో పాటు కోవెల ఏర్పాటుకు రూ.3.16 కోట్లు ఇచ్చారు. ఉల్లందూర్‌పేటలో శ్రీవారి ఆలయంతో పాటు శ్రీ పద్మావతి, శ్రీ ఆండాల్ అమ్మవార్ల ఉప ఆలయాలు కూడా నిర్మించనున్నారు.
భూమి పూజలో పాల్గొనడానికి ప్రముఖులు రావడంతో భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. కార్యక్రమంలో టీటీడీ పాలకమండలి సభ్యుడు శేఖర్‌రెడ్డి, పలువురు శాసనసభ్యులు, టీటీడీ ముఖ్య ఇంజినీరు రమేశ్‌రెడ్డి, వేలాది మంది భక్తులు పాల్గొన్నారు.













