భారత్ జోడో యాత్రలో నూతన రాహుల్ ఆవిర్భావం: సీనియర్ నేత జైరాం రమేష్
భారత్ జోడో యాత్రతో కొత్త రాహుల్ గాంధీ ఆవిర్భవించాడని, దీంతో బీజేపీ, ఆరెస్సెస్లకు వణుకు మొదలైందని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ చెప్పారు. రాహుల్ పాదయాత్ర తమిళనాడు నుంచి కర్నాటకలోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో జైరాం రమేష్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. వర్షం కారణంగా రాహుల్ యాత్ర శనివారం నాడు కొద్దిసేపు నిలిచింది. కాసేపటి తర్వాత వర్షం ఆగగానే మళ్ళీ మొదలైంది. 15 రోజుల తర్వాత మళ్లీ వర్షాలు పడడంతో రైతులకు లాభమని, రాహుల్ రాకతో రైతన్నలకు మేలు జరుగుతోందని జైరాం రమేష్ ట్వీట్ చేశారు. ఈ రోజు కలాలె గేట్ వద్ద రాహుల్ కాసేపు విరామం తీసుకుంటారని, అనంతరం సాయంత్రం 4.30 గంటలకు మళ్ళీ యాత్ర ప్రారంభమై రాత్రి 7 గంటలకు మైసూర్ చేరుకుంటుందని పార్టీ వర్గాలు తెలిపాయి.













