మన్మోహన్సింగ్ పై బరాక్ ఒబామా ప్రశంసలు
ఎ ప్రామిస్డ్ ల్యాండ్ పుస్తకంలో భారత మాజీ ప్రధాని, కాంగ్రెస్ సీనియర్ నేత మన్మోహన్సింగ్ను మాజీ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రశంసలతో ముంచెత్తారు. ఉత్తేజపరిచే, ఫలవంతమైన నిర్ణయాలతో ఇద్దరి మధ్య బంధాలు బలపడేలా చేశారని గుర్తు చేసుకున్నారు. భారతదేశంపై తనకున్న ఆసక్తి, మహాత్మాగాంధీ జీవితం, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌తో ఉన్న సంబంధాల గురించి ఈ పుస్తకంలో ప్రత్యేకంగా రాసుకున్నారు. ప్రధాని మన్మోహన్సింగ్ అసాధారణ జ్ఞానం, మర్యాద కలిగిన వ్యక్తి అని పేర్కొన్నారు. నవంబర్ 2010లో మొదటిసారి భారత్‌ను సందర్శించానని, ఆ సందర్భంగా.. సున్నితమైన, మృదువుగా మాట్లాడే స్వభావం గల ఆర్థికవేత్తను కలుసుకున్నానని అన్నారు.
అలాగే అతని తలపాగా, తెల్లని గడ్డం సిక్కు విశ్వాసానికి చిహ్నాలుగా ఉన్నాయని కొనియాడారు. ఆయన 1990లో భారత ఆర్థికవేత్తగా ఉన్నారని, లక్షలాది మంది ప్రజలను పేదరికం నుంచి బయటపడేశారని చాలా తెలివైన, ఆలోచనాపరుడిగా, నిజాయితీపరుడిగా ఆయనన్ను నేను గుర్తించానని ఆ పుస్తకంలో రాశారు. ఆయన విదేశాంగ విధానంలో జాగ్రత్తగానూ ఉండగలరని పేర్కొన్నారు. ఢిల్లీ పర్యటనలో ఉగ్రవాద నిరోధకత, ప్రపంచ ఆరోగ్యం, అణుభద్రత, వాణిజ్యంపై అమెరికా సహకారాన్ని బలోపేతం చేయడానికి మేము ఒప్పందాలు కుదుర్చుకున్నాము అని ఒబామా చెప్పారు. నవంబరు 2011 ముంబైలో జరిగిన దాడుల తరువాత మన్మోహన్ పాకిస్థాన్‌పై సంయమనం పాటించడం వల్ల రాజకీయంగా దెబ్బతీసిందని ఒబామా రాశారు. బహుశా ముస్లిం వ్యతిరేక భావన పెరుగుతుందని అనుకొని ఉంటారు. కాగా, అప్పటి ప్రధాన ప్రతిపక్షపార్టీ బీజేపీ ప్రభావాన్ని బలపరుస్తుందని భయపడి ఉంటారని ఒబామా రాశారు.













