ఉత్తరాఖండ్ గవర్నర్ రాజీనామా
ఉత్తరాఖండ్ గవర్నర్ బేబీ రాణి మౌర్య తన పదవికీ రాజీనామా చేశారు. పదవీ కాలం పూర్తి కావడానికి రెండేండ్ల ముందుగానే ఈ నిర్ణయం తీసుకున్నారు. రాజీనామా లేఖను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు పంపారు. గవర్నర్ కార్యదర్శి బ్రిజేష్ కుమార్ సంత్ ఈ విషయాన్ని ధ్రువీకరించారు. 2018 ఆగస్టులో ఉత్తరాఖండ్ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఉత్తరాఖండ్ తొలి మహిళ గవర్నర్ మార్గరెట్ అల్వా తర్వాత ఆ రాష్ట్రానికి రెండో మహిళ గవర్నర్‌గా ఆమె వ్యవహరించారు.
బేబీ రాణి మౌర్య 1956లో జన్మించారు. గవర్నర్ కావడానికి ముందు అనేక రాజకీయ పరిపాలనా పదవులలో పనిచేశారు. 1995 నుండి 2000 వరకు ఆగ్రా మేయర్‌గా ఉన్నారు. 2001లో యూపీ రాష్ట్ర సాంఘిక సంక్షేమ బోర్డు సభ్యులుగా, 2002లో జాతీయ మహిళ కమిషన్ సభ్యురాలుగా పని చేశారు. 1996లో ఆమెకు సమాజ్ రత్న, 1997లో ఉత్తర ప్రదేశ్ రత్న, 1998లో నారి రత్న అవార్డులు లభించాయి. ఆమె రాజీనామాను రాష్ట్రపతి ఆమోదించాల్సి ఉంది













