అలా చేస్తే 60 రోజుల్లోనే 50 కోట్ల మందికి…
కొవిడ్ -19 వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసేందుకు ప్రైవేట్ రంగాన్ని మమేకం చేయాలని విప్రో వ్యవస్థాపకులు, దాతృత్వశీలి అజీం ప్రేమ్‌జీ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు విజ్ఞప్తి చేశారు. ప్రైవేట్ రంగం చొరవతో దేశంలో కేవలం రెండు నెలల్లోనే 50 కోట్ల మందికి వ్యాక్సిన్ అందించవచ్చని ఆయన పేర్కొన్నారు. ప్రైవేట్ రంగాన్ని వ్యాక్సినేషన్ కార్యక్రమంలో పాల్గొనేలా చూస్తే మనం కేవలం 60 రోజుల్లోనే 50 కోట్ల మందికి వ్యాక్సిన్ ఇవ్వచ్చని తెలిపారు. బెంగళూర్‌లో పరిశ్రమ సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రేమ్‌జీ పాల్గొన్నారు. ప్రైవేట్ రంగం ముందుకువస్తే వ్యాక్సినేషన్ రేటు అనూహ్యంగా పెరుగుతుందని పేర్కొన్నారు.
కొవిడ్ -19 వ్యాక్సిన్లను రికార్డు సమయంలో అభివృద్ధి చేశారని, ఇప్పుడు వీటిని పెద్దసంఖ్యలో ప్రజలకు చేరవేయడం మన ముందున్న సవాల్ అన్నారు. ఇక ఇప్పటివరకూ దేశవ్యాప్తంగా 1.11 కోట్ల ఫ్రంట్‌లైన్ వర్కర్లు, ఆరోగ్య సంరక్షణ సిబ్బందికి కరోనా వైరస్ వ్యాక్సిన్‌ను అందచేశారు.













