భవిష్యత్ తరాలు అయోధ్య కోసం ఉవ్విళ్లూరేలా చేయండి : ప్రధాని మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ అయోధ్య నగర అభివృద్ధిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇందులో యూపీ ముఖ్యమంత్రి యోగి, ఇతర ఉన్నతాధికారులు వర్చువల్‌గా పాల్గొన్నారు. భవిష్యత్ తరాల వారు అయోధ్యను ఒక్కసారైనా చూసి తీరాలని ఉవ్విళ్లూరేలా అభివృద్ధి చేయాలని మోదీ ఆకాంక్షించారు. అభివృద్ధి ఎంత చేపట్టినా, సాంస్కృతిక వారసత్వాన్ని మాత్రం విడిచిపెట్టకుండా చూడాలని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు. అయోధ్య నగరం ప్రతి భారతీయుడిది కావాలని పేర్కొన్నారు. ప్రతి భారతీయుడికి అయోధ్య ఎంతో చిరపరిచితమని, సాంస్కృతిక నగరంగా భారతీయుడి హృదయంలో నాటుకుపోయిందని అన్నారు. అభివృద్ధి పనుల్లో సాంస్కృతి, సంప్రదాయలు స్పష్టంగా కనిపిస్తూనేఉండాలని, అయితే రాబోయే తరాలు ఈ అభివృద్ధికి అనుసంధానం అయ్యేలా చూడాలని పేర్కొన్నారు. శ్రీరాముడు తన పాలనలో ప్రజలందరినీ ఏక తాటిపై ఎలా నడిపించారో, అయోధ్య అభివృద్ధి విషయంలోనూ స్థానికులందర్నీ ఏక తాటిపై నడిపించాలని, వారుకూడా ఇందులో భాగం పంచుకునేలా విధానాలను రూపొందించాలని ఆదేశించారు. ముఖ్యంగా స్థానికంగా ఉండే యువతను ఇందులో భాగంచేయాలన్నారు. అయోధ్య అందరి నగరమని, ఎంతో ఉత్కృష్టమైన, ఆధ్యాత్మిక నగరమని మోదీ వివరించారు. యాత్రికులతో పాటు ప్రతి ఒక్కరికీ ఈ అభివృద్ధి ఉపయోగకరంగా ఉండాలని, పాత, కొత్త మేలు కలయికగా ఉండాలన్నారు. అత్యంత కీలకమైన అభివృద్ధి ఇప్పుడే ప్రారంభమైందని, అయోధ్య సాంస్కృతిక చైతన్యాన్ని సజీవంగా ఉంచడానికి అందరూ సమిష్టిగా కృషి చేద్దామని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.