సీఎం కేజ్రీవాల్ మొబైల్ పాస్వర్డ్ అడగడం బీజేపీ కుట్రే: అతిశీ
తమ ముఖ్యమంత్రి మొబైల్ ఫోన్ పాస్‌వర్డ్‌ను ఈడీ ప్లాన్ ప్రకారమే అడుగుతోందని ఢిల్లీ మంత్రి ఆతిశీ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం కనుసన్నల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పనిచేస్తోంందని, ఈడీని బీజేపీ ఓ రాజకీయ ఆయుధంగా ఉపయోగించుకుంటోందని ఆరోపించారు. ఈడీ గురువారం కోర్టులో వినిపించిన వాదనలపై కూడా ఆమె విమర్శలు గుప్పించారు. ఆప్ మంత్రి అతిశీ శుక్రవారం ఆప్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సర్కార్‌పై, ఈడీపై తీవ్ర ఆరోపణలు చేసిన అతిశీ.. కేజ్రీవాల్ మొబైల్ ఫోన్ పాస్‌వర్డ్‌తో ఈడీకి అవసరం లేదని, అయితే ఆ పాస్వర్డ్ బీజేపీకి కావాలని, దాని ద్వారా ఆమ్ ఆద్మీ పార్టీ లోక్‌సభ ఎన్నికల వ్యూహాలను తెలుసుకోవడమే ఆ పార్టీ లక్ష్యమని ఆరోపించారు.
కేజ్రీవాల్ కస్టడీ పొడిగించాలని కోరుతూ ఈడీ గురువారం కోర్టులో వినిపించిన వాదనల గురించి ప్రస్తావించిన అతిశీ.. సీఎం కేజ్రీవాల్‌పై మోపిన ఆరోపణల్లో ఒక్కదానికీ ఈడీ ఆధారాలు చూపించలేకపోయిందని, అందుకే ఇప్పుడు కేసును మొబైల్ పాస్వర్డ్లవైపు తిప్పారని ఆరోపించారు. కానీ ఈడీ ఆ పాస్‌వర్డ్‌లను కేసు దర్యాప్తు కోసం అడగటం లేదని, కేజ్రీవాల్ ఫోన్లో ఉన్న ఆప్ లోక్‌సభ ఎన్నికల వ్యూహాలు, ప్రచార ప్రణాళికలు, విపక్ష ‘ఇండియా’ కూటమి నేతలతో జరిపిన చర్చలు, మీడియా-సోషల్ మీడియా ప్రచారానికి సంబంధించిన వివరాలను తెలుసుకోవాలనుకుంటున్న బీజేపీ కోసం అడుగుతోందని ఆతిశీ ఆరోపించారు. ఇది కచ్చితంగా బీజేపీ కుట్రేనని ఆమె అన్నారు. ఇలాంటి అవినీతి రాజకీయాలను, నియంతృత్వ శక్తులను వ్యతిరేకించాలనే ఉద్దేశంతోనే కేజ్రీవాల్ రాజకీయాల్లోకి వచ్చారని స్పష్టం చేశారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆయన అదే పనిలో ఉన్నారని పేర్కొన్నారు.













