31 ఏళ్ల తరువాత మళ్లీ పూజలు
వారణాసిలోని జ్ఞానవాపి మసీదు సమీపంలోని ప్రాంగణంలో హిదూవర్గాలు పూజలు ప్రారంభించాయి. సరిగ్గా 31 ఏళ్ల తరువాత మళ్లీ పూజలకు అవకాశం ఇస్తూ స్థానిక కోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో బుధవారం రాత్రి 10:30 గంటల సమయంలో అప్పటికప్పుడు పూజలు చేశారు. మసీదు ప్రాంగణానికి పక్కనే ఉన్న సెల్లార్‌లోని విగ్రహాలవద్ద ఈ ప్రక్రియ నిర్వహించారు. ఈ హిందూ ఆలయ ప్రాంతంలో తరతరాలుగా వ్యాస్ కుటుంబానికి చెందినవారు అర్చనలు చేయడం ఆనవాయితీ. కాశీవిశ్వనాథ ఆలయానికి సమీపంలో ఈ జ్ఞానవాపి ఉంది. కాగా 31 ఏళ్ల తరువాత వ్యాస్ కుటుంబానికి చెందిన జితేంత్రనాధ్ వ్యాస్ ప్రార్థనలు నిర్వహించారు. పూజలు చేశారు. ఇప్పుడు పూజలు నిర్వహించిన ప్రాంతాన్ని వ్యాస్జీ సెల్లార్గా పిలుస్తారు. దాదాపు 31 ఏళ్ల తరువాత ఆ సెలార్ను తెరిచారు. ఎటువంటి అవాంఛనీయ పరిస్థితులు ఏర్పడకుండా జిల్లా అధికారులు తగిన బందోబస్తు, ఇతర ఏర్పాట్లు చేశారు. తమ కుటుంబానికి చెందిన జితేంత్రనాథ్ వ్యాస్ తప్ప ఇతర కుటుంబ సభ్యులు ఎవరూ సెల్లార్లోకి వెళ్లలేదని వ్యాస్ కుటుంబ సభ్యుడు అశుతోష్ వ్యాస్ తెలిపారు.













