బ్లాక్ ఫంగస్ ను ఆయుష్మాన్ భారత్ లో చేర్చండి : సోనియా
కరోనాకు సమాంతరంగా బ్లాక్ ఫంగస్ కూడా ప్రజలను భయపెడుతోందని, దీనిపై దృష్టి సారించాలని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ కేంద్రానికి సూచించారు. బ్లాక్ ఫంగస్‌ను ఆయుష్మాన్ భారత్‌లోకి చేర్చాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆమె ప్రధాని మోదీకి ఓ లేఖ రాశారు. అలాగే లిపోసోమల్ ఆంఫోటెరిసిన్-బీ కొరత కూడా మార్కెట్లో తీవ్రంగా ఉందని లేఖలో ప్రస్తావించారు. బ్లాక్ ఫంగస్ వ్యాధి చికిత్సకు అవసరమయ్యే ఔషధాలను ఉత్పత్తి చేసి, సరఫరా అయ్యేలా చూడాలని కేంద్రాన్ని కోరారు. చికిత్స అవసరమైన రోగుల సంరక్షణకు ఉచిత సేవలు అందజేయాలని, ఈ వ్యాధి చికిత్సకు అవసరమైన లిపోసోమల్ ఆంఫోటెరిసిన్-బీ మందు కొరత ఉందన్న విషయం తమ దృష్టికి వచ్చిందని సోనియా పేర్కొన్నారు. అందుకే దీనిని ఆయుష్మాన్ భారత్‌తో పాటు ఇతర ఆరోగ్య బీమా పథకాల్లో చేర్చాలని సోనియా కేంద్రానికి సూచించారు.













