బెంగాల్, అసోంలో ముగిసిన తొలి విడత ప్రచారం
బెంగాల్, అసోం తొలి దశ ఎన్నికల ప్రచారం ముగిసింది. బెంగాల్లో 30 అసెంబ్లీ స్థానాలకు గాను, అసోంలో 47 స్థానాలకు శనివారం పోలింగ్ జరగనుంది. తొలివిడత ప్రచారాన్ని రెండు రాష్ట్రాల్లోనూ ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా బీజేపీ తరపున ప్రచారాన్ని ప్రారంభించారు. యూపీ సీఎం యోగి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీతో పాటు మరికొంత మంది కేంద్ర మంత్రులు ఈ ప్రచారంలో పాల్గొన్నారు. అయితే బెంగాల్లోనే ఎన్నికల ప్రచార వేడి విపరీతంగా నడిచింది. అసోంలో ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉంది. ప్రచారం సందర్భంగా బీజేపీ కాంగ్రెస్ పరిపాలనపై తీవ్రంగా మండిపడింది. కాంగ్రెస్ పరిపాలన వల్లే అసోం ఇంతలా వెనకబడిందని ఆరోపించారు. దీంతో పాటు సీఏఏ లాంటి అంశాలు కూడా ప్రచారంలో వచ్చి చేరాయి. సీఏఏ, అక్రమ చొరబాట్లు, కాంగ్రెస్ అవినీతి లాంటి అంశాలు చర్చకు వచ్చాయి. ఇక కాంగ్రెస్ తరపున కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ప్రచారంలో పాల్గొన్నారు.
పెరిగిన పెట్రో, డీజిల్ ధరలు, ప్రస్తుత రాజకీయ పరిణామాలపై రాహుల్ కేంద్రంపై విరుచుకుపడ్డారు. ఇక బెంగాల్లో ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి షా ఓ వైపు, సీఎం మమత ఒక్కరే ఒకవైపు. ప్రచారం సందర్భంగా నువ్వా నేనా? అన్నట్టుగా బీజేపీ, తృణమూల్ నేతలు విరుచుకుపడ్డారు. సీఎం మమతపై దాడి జరిగిందని తృణమూల్ పేర్కొనగా, అసలు దాడే జరగలేదని పోలీసులు రిపోర్టు సమర్పించారు. కాలికి గాయంతో, వీల్‌చైర్‌లోనే సీఎం మమత ప్రచారం చేస్తూ బీజేపీపై విరుచుకుపడ్డారు. బెంగాలీలు బెంగాల్ కూతురినే కోరుకుంటున్నారని, బీజేపీ అవుట్ సైడర్ పార్టీ అని, బీజేపీకి ఓటు వేయవద్దని మమత విజ్ఞప్తి చేశారు. అసోం చివరి రోజు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ప్రచారం నిర్వహించగా, ప్రచారానికి ఒక రోజు ముందు బెంగాల్లో ప్రధాని మోదీ ప్రచారం నిర్వహించారు.













