తన అరెస్టుపై సుప్రీం కోర్టులో వేసిన పిటిషన్‌ను వెనక్కు తీసేసుకున్న కేజ్రీవాల్
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను గురువారం రాత్రి 9 గంటల సమయంలో ఈడీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. సీఎం అరెస్ట్ కావడంతో ఢిల్లీలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. పార్టీ నేతలు, కార్యకర్తలు రోడ్లపైకి చేరి తీవ్ర నిరశనలు చేస్తున్నారు. మంత్రులు, కార్యకర్తలు భాజపా కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టడంతో దీంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టి నిరసనలు చేపట్టిన ఆప్ మంత్రులు ఆతిశీ, సౌరభ్ భరద్వాజ్‌ను అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
ఇదిలా ఉంటే ఈ వ్యవహారంలో తన అరెస్ట్‌కు వ్యతిరేకంగా సుప్రీం కోర్టులో పిటిషన్ వేసిన కేజ్రీవాల్ తాజాగా తన పిటిషన్‌ను వెనక్కి తీసుకున్నారు. ఈడీ అరెస్ట్ నేపథ్యంలో పీఎంఎల్ఏ కోర్టులో విచారణ జరగనుండడం, దీనికి కేజ్రీవాల్ సుప్రీం కోర్టులో వేసిన పిటిషన్ చట్టపరంగా అడ్డుగా ఉండడంతో ఆయనను పిటిషన్ వెనక్కి తీసుకోవాలని ధర్మాసనం సూచించినట్లు సమాచారం. కోర్టు సూచనలతోనే కేజ్రీవాల్ తన పిటిషన్‌ను వెనక్కి తీసుకున్నట్లు తెలుస్తోంది. పిటిషన్ వెనక్కి తీసుకున్న తర్వాత ఈడీ ఆయనను కోర్టులో హాజరుపర్చింది.
వివరాల్లోకి వెళితే.. బుధవారం ఉదయం ఈడీ తనను అరెస్ట్ చేయకుండా స్టే ఇవ్వాలని కోరుతూ కేజ్రీవాల్ ఢిల్లీ హై కోర్టులో పిటిషన్ వేశారు. అయితే అందుకు ధర్మాసనం తీరస్కరించింది. దీంతో కేజ్రీవాల్ సుప్రీం కోర్టు తలుపు తట్టారు. అంతలోనే ఈడీ అధికారులు సాయంత్రానికి కేజ్రీవాల్ ఇంటికి చేరుకుని 2 గంటల పాటు సోదాలు జరిపారు. సీఎంపై ప్రశ్నల వర్షం కురిపించారు. అనంతరం ఆయనను అరెస్ట్ చేస్తున్నట్లు ప్రకటించి రాత్రి 11, 12 గంటల సమయంలో కట్టుదిట్టమైన బందోబస్తు మధ్య ఈడీ కార్యాలయానికి తరలించారు. ఈ క్రమంలోనే కేజ్రీవాల్ తరపు న్యాయవాదుల బృందం అరెస్టును వ్యతిరేకిస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ అభ్యర్థనపై శుక్రవారం అత్యవసర విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఈ పిటిషన్‌పై ప్రత్యేక త్రిసభ్య ధర్మాసనం విచారణ జరుపుతుందని సీజేఐ జస్టిస్ డి.వై. చంద్రచూడ్ వెల్లడించారు కూడా. అయితే రిమాండ్ కోసం కేజ్రీవాల్‌ను ఈడీ ట్రయల్ కోర్టులో ప్రవేశపెట్టింది. దీంతో ట్రయల్ కోర్టులో రిమాండ్ ప్రొసీడింగ్స్‌కు, సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై ప్రొసీడింగ్స్‌కు మధ్య క్లాష్ అవుతుండడంతో, ఆ విషయాన్ని సీఎం తరఫు న్యాయవాదులు అత్యున్నత న్యాయస్థానానికి తెలిపి పిటిషన్‌ను ఉపసంహరించుకునేందుకు అనుమతించాలని కోరారు. కోర్టు అనుమతించడంతో పిటిషన్ వెనక్కి తీసుకోవడం జరిగింది. అనంతరం ఈడీ అధికారులు కేజ్రీవాల్‌ను ప్రత్యేక కోర్టు ఎదుట హాజరుపర్చారు. కాగా.. ట్రయల్ కోర్టు తీర్పునకు అనుగుణంగా మరో పిటిషన్‌తో సుప్రీంను ఆశ్రయిస్తామని కేజ్రీవాల్ తరపు న్యాయవాదులు వెల్లడించారు.
ఫ్యామిలీ హౌజ్ అరెస్ట్:
ఒకవైపు సీఎం కేజ్రీవాల్‌ను ఈడీ ట్రయల్ కోర్టులో ప్రవేశపెట్టగా.. మరోవైపు సీఎం కుటుంబసభ్యులను గృహ నిర్బంధంలో ఉంచినట్లు ఢిల్లీ మంత్రి గోపాల్ రాయ్ ఆరోపణలు చేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. శుక్రవారం ఉదయం తాను కేజ్రీవాల్ నివాసానికి వెళ్లానని, అయితే తనను లోనికి వెళ్లకుండా భద్రతా సిబ్బంది అడ్డుకున్నారని గోపాల్ రాయ్ ఆరోపించారు.‘‘సీఎం అరెస్టయ్యారు. ఆయన కుటుంబం ఎలా ఉందో, ఎలాంటి పరిస్థితుల్లో ఉందో తెలియడం లేదు. కేజ్రీవాల్ తల్లిదండ్రులు వృద్ధులు, వాళ్లు ఇంట్లోనే ఉన్నారు. వారి పరిస్థితి గురించి ఎలాంటి సమాచారం లేదు. కనీసం వారిని కలిసి ఓదార్చేందుకు, ధైర్యం చెప్పేందుకు కూడా మమ్మల్ని లోపలికి అనుమతించకపోవడం దారుణం. ఏ చట్టం కింద వారిని హౌజ్ అరెస్ట్ చేశారో చెప్పాలి. తప్పుడు కేసులో సీఎంను శిక్షించేందుకు ప్రయత్నించడమే కాకుండా.. ఆయన తల్లిదండ్రులు, పిల్లలపై కూడా కేంద్రం కక్ష సాధిస్తోంది’’ అని గోపాల్ రాయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.













