తీహార్ జైలుకు సీఎం కేజ్రీవాల్.. దేశ చరిత్రలోనే తొలిసారి
భారతదేశ చరిత్రలోనే ఎన్నడూ కనీ వినీ ఎరుగని విధంగా నేడు ఓ ముఖ్యమంత్రి తన పదవిలో ఉండగానే తీహార్ జైలుకు వెళ్లనున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ప్రధాన నిందితుడిగా ఉన్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను స్పెషల్ కోర్టు జ్యూడీషియల్ కస్టడీకి అప్పగించడంతో ఈ పరిస్థితి చోటుచేసుకుంది. మార్చి 21వ తేదీన అరెస్టైన కేజ్రీవాల్‌ను మొదట 6 రోజులు, ఆ తర్వాత 4 రోజుల ఈడీ కస్టడీకి అప్పగించిన కోర్టు తాజాగా 15 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి అప్పగిస్తూ ఆయనను తీహార్ జైలుకు తరలించాలని సంచలన తీర్పునిచ్చింది. దీంతో కస్టడీ ముగియడంతో ఆయన విడుదలవుతారన్న అభిమానులకు పెద్ద షాక్ తగిలింది. ఇక కోర్టు ఆదేశాలతో అధికారులు కేజ్రీవాల్‌ను తీహీర్ జైలుకు తరలించారు.
కేజ్రీవాల్ షాకింగ్ కామెంట్స్:
సోమవారంతో కేజ్రీవాల్ కస్టడీ ముగియడంతో ఆయనను కోర్టులో హాజరుపరిచేందుకు ఈడీ అధికారులు తీసుకెళ్తుండగా పీఎం మోదీపై కేజ్రీవాల్ షాకింగ్ కామెంట్స్ చేశారు. అధికారులతో కలిసి కోర్టులోకి వెళుతూనే ‘‘ప్రధాని మోదీ ఏదైతే చేస్తున్నారో.. అది ఏ మాత్రం సరైంది కాదు’’ అంటూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.
విచారణకు సహకరించడం లేదన్న ఈడీ:
కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా ఈడీ తన వాదనలను బలంగా వినిపించింది. కేజ్రీవాల్ విచారణకు సహకరించడం లేదని కోర్టుకు తెలిపింది. ఆయన అస్పష్టమైన సమాధానాలు ఇస్తున్నాడని, ఆయన ఐఫోన్ పాస్‌వర్డ్‌ను కూడా ఇవ్వడం లేదని, అందువల్ల దర్యాప్తు ముందుకు సాగడం లేదని ఆరోపించింది. మరో 15 రోజుల పాటు జ్యూడీషియల్ కస్టడీకి అప్పగించాలని కోర్టును కోరింది. ఈడీ వాదనలతో ఏకీభవించిన కోర్టు కేజ్రీవాల్‌ను జ్యూడీషియల్ కస్టడీకి అప్పగించింది.
మిగిలిన ఆప్ నేతలు ఏ జైలులో..
తీహార్ జైలులో మొత్తం 9 జైళ్లు ఉండగా అందులో దాదాపు 12 వేల మంది ఖైదీలు ఉన్నారు. ఇక ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులోనే ఆప్ పార్టీకి చెందిన మరికొంతమంది నేతలు ఇప్పటికే తీహార్ జైలులో ఉన్నారు. ఆప్ మాజీ మంత్రి మనీశ్ సిసోడియా 1వ నంబర్ జైలులో ఉన్నారు. మరో మాజీ మంత్రి సంజయ్ సింగ్ 5వ నెంబర్ జైలులో ఉన్నారు. 7వ నెంబర్ జైలులో మాజీ ఎడ్యుకేషన్ మినిస్టర్ సత్యేంద్ర జైన్ ఉన్నారు.













