రేపు మీ ఆఫీస్ కు వస్తాం.. జైల్లో పెట్టండి
ప్రధాని నరేంద్ర మోదీపై, అధికార బీజేపీపై ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ జాతీయ కన్వీనర్ అర్వింద్ కేజ్రీవాల్ తీవ్ర విమర్శలు చేశారు. ప్రతిపక్ష నేతలను తొక్కేయడమే బీజేపీ లక్ష్యంగా పెట్టుకుందని ఆయన ఆరోపించారు. బీజేపీ బెదిరింపులకు ఆమ్ ఆద్మీ పార్టీ లొంగకపోవడంతో కక్ష్య సాధింపులకు పాల్పడుతోందని మండిపడ్డారు. అయినా ఆప్ భయపడదని హెచ్చరించారు. రేపు మధ్యాహ్నం 12 గంటలకు తమ పార్టీ ముఖ్య నేతలందరినీ తీసుకుని ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయానికి వస్తున్నానని, అక్కడ మీకు కావాల్సిన వాళ్లను అరెస్ట్ చేసి జైల్లో పెట్టవచ్చని కేజ్రీవాల్ సవాల్ చేశారు. బీజేపీ ఇప్పటికే మనీశ్ సిసోడియాను, సంజయ్ సింగ్ను జైల్లో పెట్టిందని, ఇప్పుడు నా పీఏను కూడా అరెస్టు చేసిందని అన్నారు. రాఘవ్ చద్దా లండన్ నుంచి వస్తున్నాడని వాళ్లే చెబుతున్నారని ఆయనకు కూడా వీళ్లు జైల్లో పెడుతారని ఎద్దేవా చేశారు.













