కేజ్రీవాల్‌కు మళ్లీ షాక్.. ‘రాజకీయ కుట్రే’ అన్న కేజ్రీవాల్!
ఢిల్లీ మధ్యం కుంభకణంలో అరెస్టై ఈడీ కస్టడీలో ఉన్న సీఎం కేజ్రీవాల్‌కు ప్రత్యేక కోర్టు మరోసారి షాకిచ్చింది. 7 రోజుల రిమాండ్ ముగియడంతో కేజ్రీవాల్‌ను గురువారం తిరిగి కోర్టు ముందు ప్రవేశపెట్టిన ఈడీ మరో 7 రోజుల రిమాండ్ కావాలంటూ వాదనలు వినిపించింది. ఇరు వర్గాల వాదనలు విన్న రౌస్ అవెన్యూ కోర్టు ప్రత్యేక జడ్జి కావేరి బవేజా.. కేజ్రీవాల్ రిమాండ్‌ను మరో 4 రోజుల పాటు పొడిగిస్తూ తీర్పిచ్చారు. ఏప్రిల్ 1వరకు ఆయన్ను ఈడీ కస్టడీకి అప్పగిస్తూ తీర్పు వెలువరించింది. తిరిగి ఏప్రిల్ 1న ఉదయం 11గంటలకు తమ ఎదుట హాజరు పరచాలని ఈడీని ఆదేశించారు.
కేజ్రీవాల్‌పై ఈడీ ఆరోపణలు:
6 రోజల పాటు కేజ్రీవాల్‌ను కస్టడీలోకి తీసుకున్న ఈడీ.. 5 రోజుల స్టేట్మెంట్లను రికార్డు చేసినట్లు కోర్టుకు తెలిపింది. అయితే చాలా ప్రశ్నలను ఆయన దాటవేత సమాధానాలను చెబుతున్నారని, డిజిటల్ పరికరాల పాస్‌వర్డ్‌లను వెల్లడించడం లేదని ఈడీ తన రిమాండ్ రిపోర్టులో పేర్కొంది. అదే సమయంలో మరో ముగ్గురు వ్యక్తుల వాంగ్మూలాలను సైతం రికార్డు చేసినట్లు తెలిపింది.
ఓ సీఎంను అరెస్ట్ చేయడానికి అవి సరిపోతాయా?: కేజ్రీవాల్
కోర్టు విచారణ జరుగుతున్న సమయంలో కేజ్రీవాల్ స్వయంగా తన వాదనలు వినిపించారు. ఈ కేసులో తన పేరును నలుగురు సాక్షులు మాత్రమే ప్రస్తావించారని, ఒక సీఎంను అరెస్టు చేయడానికి వాళ్ల సాక్ష్యాలు సరిపోతాయా? అంటూ ఈడీని నిలదీశారు. కాగా.. తన అరెస్టును రాజకీయ కుట్రగా అభివర్ణించిన కేజ్రీవాల్.. ఇదంతా దేశం ముందు ‘ఆప్’ను ఓ అవినీతి పార్టీగా చిత్రీకరించడంలో భాగంగా అభివర్ణించారు. ఈడీ విచారణను ఎదుర్కొనేందుకు తాను వెనుకాడేది లేదని, ఎలాంటి విచారణకైనా తాను సిద్ధమని అన్నారు.













