హిమాచల్ కాంగ్రెస్లో గందరగోళం..! సీఎం సీటు కోసం నేతల పాకులట..!
హిమాచల్ ప్రదేశ్ లో బీజేపీని ఓడించి అధికారం దక్కించుకుంది కాంగ్రెస్ పార్టీ. కష్టకాలంలో ఆశాదీపంలా ఈ విజయం దక్కింది. అయితే అన్నీ సాఫీగా అనుకున్నట్టు సాగితే అది కాంగ్రెస్ పార్టీ ఎందుకవుతుంది? ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్ లో కూడా నేతల మధ్య అనైక్యత స్పష్టంగా కనిపిస్తోంది. అధికార పీఠం కోసం నేతలు పోటీ పడుతున్నారు. సీఎం సీటు నాకు కావాలంటే నాకు కావాలంటూ నేతలు పట్టుబడుతున్నారు. ఈ వ్యవహారం కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి పెద్ద సవాల్ గా మారింది. దీన్ని ఎలా డీల్ చేయాలో అర్థం కాక కాంగ్రెస్ అధిష్టానం తలలు పట్టుకుంటోంది. అయితే ఇవాళ ఎలాగైనా సీఎం అభ్యర్థిని ఎంపిక చేయాలనే పట్టుదలతో ఉంది.
హిమాచల్ ప్రదేశ్ లో సీఎం అభ్యర్థి ఎంపిక కాంగ్రెస్ పార్టీకి పెద్ద సవాల్ గా మారింది. సీఎంగా ఎవరిని ఎంపిక చేస్తారనేది ఆసక్తిగా మారింది. ముఖ్యమంత్రి రేసులో పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు ప్రతిభా సింగ్, మాజీ అధ్యక్షుడు సుఖ్వీందర్ సింగ్ సుఖు, తాజా మాజీ సీఎల్పీ నేత ముఖేశ్ అగ్నిహోత్రి ఉన్నారు. వీరి ముగ్గురిలో ఒకరు సీఎం కావడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. సీఎంగా ఎవర్ని ఎంపిక చేయాలనే అంశంపై ఎమ్మెల్యేల అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకునేందుకు నిన్న సీఎల్పీ భేటీ నిర్వహించింది కాంగ్రెస్ పార్టీ. అయితే ఏఐసీసీ పరిశీలకుల భేటీలో స్పష్టం తారేలుద పీసీసీ చీఫ్ ప్రతిభా సింగ్ కు 15 మంది ఎమ్మెల్యేలు మద్దతు తెలిపారు. అలాగే మాజీ పీసీసీ చీఫ్ సుఖ్వీందర్ సింగ్ సుఖుకి 21 మంది మద్దతుగా నిలిచారు. ప్రతిభా సింగ్, సుఖ్వీందర్ సింగ్ సుఖు మధ్య పోటా పోటీ నడుస్తుండడంతో సీఎం అభ్యర్థి ఎంపిక వ్యవహారాన్ని అధిష్టానానికే వదిలేశారు ఏఐసీసీ పరిశీలకులు. పరిశీలకుల నిర్ణయాన్ని ఎమ్మెల్యేలు కూడా స్వాగతించారు.
ఏఐసీసీ పరిశీలకుల సూచన మేరకు హిమాచల్ సీఎం అభ్యర్థిని ఇవ్వాళ ఎంపిక చేయనున్నారు పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. హిమాచల్ ప్రదేశ్ లో అన్నీ తానై వ్యవహరించిన ప్రియాంక గాంధీ సూచన మేరకు ఖర్గే ముఖ్యమంత్రిని ఎంపిక చేస్తారని తెలుస్తోంది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిభా సింగ్ పోటీ చేయలేదు. ఆమె ప్రస్తుతం మండి నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పీసీసీ చీఫ్ గా పార్టీని సమర్థవంతంగా నడిపించారు. మాజీ సీఎం వీరభద్ర సింగ్ భార్యగా ఆమెకు మంచి పట్టుంది. పేరు కూడా ఉంది. నాలుగు దశాబ్దాలపాటు కాంగ్రెస్ పార్టీని సమర్థవంతంగా నడిపించారు వీరభద్రసింగ్. ఇప్పుడు ఆయన భార్య ప్రతిభా సింగ్ కూడా కష్టకాలంలో పార్టీని ముందుండి నడిపించారు. బీజేపీకి ఎదురొడ్డి కాంగ్రెస్ పార్టీని విజయతీరాలకు చేర్చారు. కచ్చితంగా తన సేవలను పార్టీ అధిష్టానం గుర్తించి తనను సీఎం చేస్తుందని ప్రతిభా సింగ్ ఆశిస్తున్నారు. ప్రతిభా సింగ్ కుమారుడు విక్రమ్ సింగ్ ప్రస్తుతం ఎమ్మెల్యేగా గెలిచారు.
ఇక సుఖ్వీందర్ సింగ్ సుఖు, ముఖేశ్ అగ్నిహోత్రి కూడా సీఎం రేసులో ఉంటున్నారు. వీరిలో సుఖ్వీందర్ సింగ్ కు మంచి పట్టుంది. మాజీ పీసీసీ చీఫ్ గా ఆయన పని చేశారు. ఇప్పుడు కూడా 21 మంది ఎమ్మెల్యేలు ఆయనకు మద్దతుగా ఉంటున్నారు. ప్రస్తుతం నదౌన్ నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక హరోలి నుంచి గెలిచిన తాజా మాజీ సీఎల్పీ నేత ముఖేశ్ అగ్నిహోత్రి కూడా సీఎం పదవి ఆశిస్తున్నారు. గత అసెంబ్లీలో పార్టీని సమర్థవంతంగా నడిపించడంలో ముఖేశ్ అగ్నిహోత్రి మంచి పేరు తెచ్చుకున్నారు. ఇలా సీఎం కుర్చీ కోసం ముగ్గురు నేతలు పోటీ పడుతున్నారు. మరి ఈ ముగ్గురినీ పార్టీ అధిష్టానం ఎలా దారికి తెచ్చి ఒప్పిస్తుందనేది ఆసక్తిగా మారింది. ఈ విభేదాలు ఇలాగే కంటిన్యూ అయితే మాత్రం ఇక్కడ కూడా బీజేపీ పాగా వేయడం ఖాయం.













