కేజ్రీవాల్ అరెస్టుపై బాధ లేదు: అన్నా హజారే
లిక్కర్ స్కాంలో అరెస్టైన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై ప్రముఖ సామాజిక కార్యకర్త, కేజ్రీవాల్ గురువు అన్నా హజారే కీలక వ్యాఖ్యలు చేశారు. మద్యం విషయంలో కేజ్రీవాల్‌ను తాను ఎన్నో సార్లు హెచ్చరించానని, కానీ ఆయన వినలేదని, అందుకే ప్రస్తుతం కేజ్రీవాల్ అరెస్టుపై తాను బాధపడడం లేదని వ్యాఖ్యానించారు. కేజ్రీవాల్ అరెస్టును నిరసిస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు, కార్యకర్తలతో పాటు ఇతర విపక్ష పార్టీలు కేజ్రీవాల్‌కు మద్దతు ప్రకటిస్తున్న సమయంలో హజారే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చేయడం తీవ్ర చర్చనీయాంశమవుతోంది.
కేజ్రీవాల్ అరెస్ట్‌పై మీడియాతో మాట్లాడిన అన్నా హజారే.. ‘కేజ్రీవాల్ గతంలో నాతో కలిసి పని చేశారు. మద్యానికి వ్యతిరేకంగా పోరాడారు. కానీ ఇప్పుడు అదే మద్యం విధానంలో ఇరుక్కుని జైలు పాలయ్యారు. అరెస్టు కొంత బాధ కలిగించినా.. ఏం చేయగలం. చట్ట ప్రకారం ఏది జరిగినా వ్యతిరేకించలేం’’ అని అన్నారు.
కాగా.. 2011లో హజారే నేతృత్వంలో అవినీతి వ్యతిరేక ఉద్యమం జరగ్గా.. అందులో హజారేకు అత్యంత సన్నిహితునిగా అరవింద్ కేజ్రీవాల్ ఉండేవారు. పోరాటం విజయవంతమైన తర్వాత అందులో నుంచే ఆమ్ ఆద్మీ పార్టీ అవతరించింది. అయితే రాజకీయాలకు తాను దూరంగా ఉంటానని స్పష్టం చేసిన హజారే.. పార్టీలో కానీ, పార్టీ కార్యకలాపాలలో భాగం కాకుండా దూరంగా ఉండిపోయారు. అంతేకాకుండా హజారే అనేక సార్లు అనేక అంశాల్లో ఆమ్ ఆద్మీ పార్టీని బహిరంగంగానే విమర్శించారు. అయితే కేజ్రీవాల్ ద్వారా ఆయనకు ఎలాంటి కౌంటర్ వచ్చేది కాదు.
ఢిల్లీ మద్యం విధానంపై అన్నాహజారే అప్పట్లోనే వ్యతిరేక స్వరం వినిపించారు. అలాగే 2022లో సదరు విధానాలపై తన బాధను వివరిస్తూ సీఎం కేజ్రీవాల్‌కు లేఖ కూడా రాశారు. సదరు లేఖలో మద్యం విధానం గురించి తెలిసి బాధకలిగిందని కూడా వ్యాఖ్యానించారు. ‘‘మీరు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నేను రాస్తున్న మొదటి లేఖ ఇది. మీ ప్రభుత్వం తీసుకొచ్చిన మద్యం విధానం గురించి తెలిసి చాలా బాధనిపించింది. మద్యం లాగానే అధికారం కూడా మత్తునిస్తుంది. మీరు అధికారం మత్తులో ఉన్నట్లు కనిపిస్తోంది’’ అంటూ కేజ్రీవాల్‌ను, కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని ఘాటుగానే విమర్శించారు. కాగా ఇప్పుడు మద్యం పాలసీ స్కాంలోనే కేజ్రీవాల్ అరెస్టు కావడంతో ఆ లేఖ ప్రస్తుతం వైరల్ అవుతోంది.
ఇదిలా ఉంటే అన్నా హజారే వ్యాఖ్యలపై ఆప్ పార్టీ స్పందించింది. “ఇది చాలా దురదృష్టకరం, ఆయనను మేమెంతో గైరవిస్తాం. కానీ ఇది విచారకరం. గతంలో బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేసిన హిమంత బిశ్వ శర్మ వంటి వ్యక్తులు బీజేపీలోకి వచ్చి సీఎం అయినప్పుడు మేం కూడా కొన్నిసార్లు బాధపడ్డాం. ఎవరూ గొంతు ఎత్తలేదు. అజిత్ పవార్ వంటి వ్యక్తులు బీజేపీతో కలిసినప్పుడు గౌరవనీయులైన ఈయన (అన్నా హజారే) ఏమీ అనరు. ఈ ప్రవర్తన ఆవేదన కలిగిస్తుంది, బాధ కలిగిస్తుంది.”













