మహారాష్ట్ర హోం మంత్రి రాజీనామా
మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ తన పదవికి రాజీనామా చేశారు. అనిల్ దేశ్‌ముఖ్‌పై ముంబయి మాజీ కమిషనర్ పరమ్ బీర్ సింగ్ చేసిన ఆరోపణలపై దర్యాప్తు చేయాలంటూ బాంబే హైకోర్టు సీబీఐని ఆదేశించింది. ఈ నేపథ్యంలో హోంమంత్రి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను ఆయన ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రేకు అందజేశారు. అయితే ఆ రాజీనామా లేఖను సీఎం ఆమోదించాల్సి ఉందని మరో మంత్రి నవాబ్ మాలిక్ తెలిపారు. హోంమంత్రిపై తాను ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రేను ఫిర్యాదు చేసిన కారణంగానే తనను బదిలీ చేశారని పరమ్ బీర్ ఆరోపించారు. పోలీసు అధికారులకు నెలకు రూ.100 కోట్ల వసూళ్ల లక్ష్యంగా విధించారని, అక్రమ బదిలీలు చేశారని హోంమంత్రిపై పరమ్ బీర్ ఆరోపణలు చేశారు. దీనిపై విచారణ జరపాలంటూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఆయనతో పాటు న్యాయవాది జయశ్రీ పాటిల్, మరో టీచర్ కూడా ఈ ఆరోపణలపై పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో అనిల్ దేశ్‌ముశ్ హోంమంత్రి పదవికీ రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.













