గుజరాత్ విజయంపై అమిత్ షా స్పందన.. విపక్షాలపై సెటైర్లు
పంజాబ్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఊపులో గుజరాత్ మీద కూడా కన్నేసింది ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్). ఆ రాష్ట్రంలో ఉచిత పథకాల హామీలు గుప్పించారు. కానీ ప్రజలు మాత్రం మరోసారి బీజేపీకే పట్టం గట్టారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ.. ‘ఉచితాలను ప్రకటించిన వాళ్లను గుజరాత్ ప్రజలు తిరస్కరించారు. మోదీ నాయకత్వంలో బీజేపీకి అద్భుతమైన విజయం సాధించింది. ఉచితాల హామీలు ఇచ్చిన వాళ్లు, బుజ్జగింపు రాజకీయాలు చేసిన వాళ్లతో తమకు అవసరం లేదని గుజరాత్ ప్రజలు తేల్చిచెప్పారు’ అని ప్రతిపక్షాలపై సెటైర్లు వేశారు. మహిళలు, యువత, రైతులు అంతా బీజేపీ వెనుకే నిలబడ్డారని, గుజరాత్ ఎప్పుడూ చరిత్ర సృష్టిస్తూనే ఉంటుందని షా అన్నారు. గత రెండు దశాబ్దాలలో అభివృద్ధికి సంబంధించి అన్ని రికార్డులను గుజరాత్ బద్దలు కొట్టిందని, అందుకే ప్రజలు మరోసారి తమ పార్టీని గెలిపించారని తెలిపారు.













