ఏరో ఇండియా షోకు బీ-1బీ బాంబర్ విమానం
ఈ యేడాది బెంగుళూరులోని యలహంకా ఎయిర్‌ఫోర్స్ స్టేషన్లో జరగనున్న ఏరో ఇండియా షోలో అమెరికాకు చెందిన బాంబర్ విమానం ప్రత్యేక ఆకర్షణ కానున్నది. అగ్రరాజ్యానికి చెందిన బీ-1బీ లాన్సర్ హెవీ బాంబర్ విమానం.. ఆ ఫోలో ఫ్లై బై నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. డీఆర్డీవో ఆధ్వర్యంలో 13వ ఎయిర్ షోను ఫిబ్రవరి 3వ తేదీ నుంచి నిర్వహించనున్నారు. సౌత్ డకోటాలోని ఎల్స్‌వర్త్ ఎయిర్‌ఫోర్స్ బేస్‌కు చెందిన 28వ బాంబ్ వింగ్ స్క్వాడ్‌లో బీ-1బీ లాన్సర్ విమానం ఉన్నది. అయితే ఆ హెవీ బాంబర్.. ఎయిర్ షోలో ఫ్లై బై నిర్వహిస్తుందని చెన్నైలోని అమెరికా కాన్సులేట్ ఓ ప్రకటనలో పేర్కొన్నది.
బీ-1బీ లాన్సర్ విమానం ఓ సూపర్ సోనిక్ హెవీ బాంబర్. ఇదో అద్భుతమైన ఎయిర్‌క్రాఫ్ట్. అమెరికా బేస్ నుంచే ఈ విమానం ప్రపంచంలో ఎక్కడైనా అత్యంత సమర్థవంతంగా మిషన్ చేపట్టగలదు. సరిహద్దుల్లోని ఫార్వర్డ్ లొకేషన్లలోనూ ఈ బాంబర్ విమానం కచ్చితత్వంతో పనిచేస్తుందని ఆ ప్రకటనలో తెలిపారు. రెండు దేశాల మధ్య వ్యూహాత్మక బంధం బలపడిందనడానికి.. ఎయిర్ షోలో పాల్గొనడమే నిదర్శనమని అమెరికా అధికారి డాన్ హెఫ్లిన్ తెలిపారు.













