అంబానీ ఇంట పెళ్లికి కరీంనగర్ ఫిలిగ్రీ ఉత్పత్తులు

దేశంలోనే అరుదైన కళల్లో కరీంనగర్ ఫిలిగ్రీ ఒకటి. వెండి తీగతో కళాకారులు ఆవిష్కరించే అద్భుతమైన ఉత్పత్తులు జిల్లా ఖ్యాతిని నలుదిశలా చాటాయి. ప్రముఖ వ్యాపార దిగ్గజం ముకేశ్ అంబానీ, నీతా దంపతులు కుమారు అనంత్ అంబానీ వివాహం సందర్భంగా ఫిలిగ్రీ మరోసారి చర్చనీయాంశమైంది. ముకేశ్ దంపతులు దేశవ్యాప్తంగా ఉన్న చేనేత హస్తకళా రూపాలను దేశ విదేశాలకు చెందిన అతిథులకు బహుమతులుగా ఇవ్వాలని నిర్ణయించారు. ఈ క్రమంలో దాదాపు 400 వస్తువులను ఆర్డర్ చేసినట్లు కరీంనగర్ ఫిలిగ్రీ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు ఎర్రోజు అశోక్, కార్యదర్శి గద్దె అశోక్‌కుమార్‌లు తెలిపారు. జులైలో ఈ పెళ్లి జరగనుంది. జువెలరీ బాక్సులు, పర్సులు, ట్రేలు, ఫ్రూట్ బౌల్స్ తదితర వస్తువులకు ఆర్డర్ ఇచ్చారు. గతేడాది జరిగిన జీ-20 సదస్సులో వివిధ దేశాల అధ్యక్షులు కోటుకు అలంకరించుకునేందుకు అశోకచక్రంతో కూడిన బ్యాడ్జీలను ఇక్కడి కళాకారులే తయారు చేసి పంపించారు.