అమర్‍నాథ్ యాత్ర రద్దు….

ఈ నెల 28 నుంచి ప్రారంభం కావాల్సిన అమర్‍నాథ్ యాత్రను రద్దు చేశారు. కరోనా మహమ్మారి వ్యాప్తి నేపధ్యంలో ఈ ఏడాది కూడా యాత్రను రద్దు చేస్తున్నట్టు జమ్మూ కశ్మీర్ లెప్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ప్రకటించారు. అమర్‍నాథ్ పుణ్యక్షేత్రం బోర్డు సభ్యులతో చర్చించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. ప్రజల ప్రాణాలు కాపాడటమే ముఖ్యమని, వారి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఈ ఏడాది యాత్రను రద్దు చేస్నుట్టు పేర్కొంది. యాత్ర రద్దు అయినప్పటికి ఎప్పటిలాగే సంప్రదాయ పూజా కార్యక్రమాలు కొనసాగుతాయని పేర్కొంది.
దక్షిణ కశ్మీర్‍లోని హిమాలయాల్లోని అమర్‍నాథుడిని దర్శించుకొనేందుకు ఏటా నిర్వహించే ఈ యాత్రకు భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. మొత్తం 56 రోజుల పాటు ఈ యాత్ర సాగుతుంది. అయితే భక్తుల సౌకర్యార్థం అమర్‍నాథ్ లింగాన్ని ఆన్‍లైన్‍లో దర్శనం చేసుకునే సౌలభ్యాన్ని కల్పిస్తున్నట్లు ప్రకటించారు. భక్తులందరూ తమ తమ ఇళ్లలోనే ఉండి, సౌకర్యవంతంగా, క్షేమంగా మంచు లింగాన్ని దర్శించుకోవచ్చని సూచించారు.