కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం… 17 ఏళ్లకే
ఓటర్ జాబితాలో పేరు నమోదు చేసుకుని గుర్తింపు కార్డు పొందేందుకు ఎవరైనా 18 ఏళ్లు నిండే వరకు వేచి చూడాల్సిందే. జనవరి 1 నాటికి 18 ఏళ్ల వయసులోనే అడుగు పెట్టిన వారు మాత్రమే ఓటరు కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలి. కానీ 18 ఏళ్ల నిండే వరకు వేచి చూడాల్సిన అవసరం లేదని ప్రకటించింది కేంద్ర ఎన్నికల సంఘం. 17ఏళ్లు నిండిన యువత ఓటర్ కార్డు కోసం ముందస్తుగా దరఖాస్తు చేసుకునేందుకు వీలు కల్పిస్తున్నట్లు స్పష్టం చేసింది.
జవవరి 1వ తేదీ ఎప్పుడొస్తుందా అని వేచి చూడకుండా 17 ఏళ్ల వయసు దాటిన వారు ఓటర్ కార్డుకు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే 18 ఏళ్లు నిండిన తర్వాతనే ఓటర్ కార్డు అందిస్తారు. కేంద్ర ప్రధాన ఎన్నికల అధికారి రాజివ్ కుమార్, ఎలక్షన్ కమిషనర్ అనుప్ చంద్ర పాండేల నేతృత్వంలోని ఈసీఐ అన్ని రాష్ట్రాల ఎన్నికల కమిషనర్లు, ఈఆర్ఓ, ఏఈఆర్ఓలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. 17 ఏళ్ల పైబడిన యువత ఓటర్ జాబితాలో పేరు నమోదుకు ముందుగా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించాలని సూచించింది. ప్రజల్లో అవగాహన కల్పించాలని తెలిపింది.













