అళగిరి సంచలన ప్రకటన… ద్రావిడ రాజకీయ యవనికపై కొత్త పార్టీ…
తమిళనాడులో సీఎం జయలలిత, డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి మరణం తర్వాత ద్రావిడ రాజకీయాలు స్తబ్దుగా నడుస్తూ వస్తున్నాయి. ఓ రకంగా చెప్పాలంటే వీరిద్దరూ మరణించిన తర్వాత ద్రావిడ రాజకీయ యవనికపై శూన్యం ఏర్పడింది. సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ రంగ ప్రవేశం కొన్ని రోజుల పాటు ఊగిసలాటగా ఉండేది. ఎప్పుడైతే… సూపర్ స్టార్ రాజకీయ రంగ ప్రవేశం ఖాయం కావడంతో అన్ని పార్టీలూ మళ్లీ క్రియాశీలకంగా మారాయి. మక్కల్ నీధి మయ్యన్ అధ్యక్షుడు, నటుడు కమల్ హసన్ కూడా యాక్టి్వ్ అయిపోయారు. సైలెంట్‌గా రాజకీయ చదరంగాన్ని మార్చేస్తారని పేరున్న మాజీ సీఎం కరుణానిధి పెద్ద కుమారుడు అళగిరి కూడా యమ యాక్టివ్ అయిపోయారు. ఎంతలా అంటే… ఏకంగా కొత్త పార్టీని స్థాపిస్తానని సంచలన ప్రకటన చేసేశారు. దీంతో ద్రావిడ భూమిలో మరో కొత్త పార్టీ ఆవిర్భావానికి రంగం సిద్ధమైంది. తాను కొత్త పార్టీ స్థాపిస్తానని సంచలన ప్రకటన చేశారు. జనవరి 3 న కీలక నేతలు, కార్యకర్తలతో ఓ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
ఈ సమావేశంలోనే కొత్త పార్టీ స్థాపించే విషయంపై కార్యకర్తల అభిప్రాయాలను తీసుకుంటానని, వాళ్లు సరేనంటే ఓ కొత్త పార్టీని స్థాపిస్తానని ఆయన ప్రకటించారు. కొత్త పార్టీని స్థాపిస్తాను కానీ, స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకేకు మాత్రం మద్దతిచ్చే ప్రసక్తే లేదని అళగిరి తేల్చి చెప్పారు. డీఎంకేలోకి తిరిగి రమ్మని స్టాలిన్ ఆహ్వానించారా? అని విలేకరులు ప్రశ్నించగా… అలాంటి ఆహ్వానాలేమీ తనకు రాలేదని ప్రకటించారు.
డీఎంకేపై అళగిరికి ఎందుకంత కోపం?
వాస్తవానికి అళగిరి, స్టాలిన్ ఇద్దరూ అన్నాదమ్ములే. మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి రెండో భార్య సంతానమే ఈ ఇద్దరూ. అళగిరి పెద్ద కుమారుడు. స్టాలిన్ చిన్న కుమారుడు. ఎంపీ కనిమొళి కరుణానిధి మూడోభార్య రజతీ అమ్మాళ్ కుమార్తె. అయితే మొదటి నుంచీ కరుణానిధి స్టాలిన్‌ను మాత్రమే రాజకీయంగా ప్రోత్సహించేవారు. తమిళనాటలోని కొంత భాగం, డీఎంకే పార్టీలోని కొంత భాగంపై అళగిరికి విపరీతమైన పట్టు ఉండేది. సైలెంట్‌గా ఉంటూ రాజకీయ చదరంగాన్ని పూర్తిగా మార్చేస్తారన్న పేరూ ఉంది. అయినా సరే.. కరుణానిధి అళగిరిని తన రాజకీయ వారసునిగా ప్రకటించలేదు. చిన్న కుమారుడైన స్టాలిన్నే రాజకీయ వారసునిగా ప్రకటించారు. అంతకు ముందే వీరిద్దరి మధ్యా భేదాభిప్రాయాలు తార స్థాయిలో ఉండేవి. పార్టీ నిబంధనలను అతిక్రమిస్తున్నారంటూ అళగిరిని డీఎంకే అధిష్ఠానం పార్టీ నుంచి బహిష్కరించింది. స్టాలిన్, అళగిరి మధ్య ఉన్న విభేదాలను రూపుమాపాలని అటు కార్యకర్తలు ఇటు సన్నిహితులు చాలా ప్రయత్నాలే చేశారు. ఆ ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. స్టాలిన్, కరుణానిధి కలిసి తన రాజకీయ భవిష్యత్తును శూన్యం చేశారని అళగిరికి ఓ రకంగా కోపం ఉందని డీఎంకే వర్గాలే పేర్కొంటాయి. ఇప్పుడు ఏకంగా పార్టీనే స్థాపిస్తానని, డీఎంకేకు మాత్రం మద్దతిచ్చే ప్రసక్తే లేదని అళగిరి ప్రకటించడం చూస్తే… ద్రవిడ రాజకీయ చదరంగం కొత్త మలుపులు తిరగుతుందనడంలో సందేహం లేదు.
రజనీతో జత కట్టనున్న అళగిరి?
రజనీ ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్లో ఉన్నారని, ఆ షూటింగ్ ముగించుకొని చెన్నైకి తిరిగి రాగానే రజనీకాంత్‌తో భేటీ అవుతానని అళగిరి సంచలన ప్రకటన చేశారు. రాబోయే ఎన్నికల్లో రజనీతో కలిసి అళగిరి పొత్తు పెట్టుకుంటారా? అన్నది ప్రస్తుతం హాట్ టాపిక్. ద్రావిడ రాజకీయమే ద్రావిడ ఉద్యమంతో పెనవేసుకుంది. అటు జయలలిత అయినా, ఇటు కరుణానిధి అయినా…. ద్రావిడ ఉద్యమాల మూల సిద్ధాంతాలపైనే పార్టీని నడిపించేవారు. కరుణానిధి పుట్టుకే ద్రావిడ ఉద్యమం నుంచి వచ్చింది. కరుణానిధి వారసత్వాన్ని స్టాలిన్ పుణికిపుచ్చుకున్నారు. కానీ… అళగిరి అంతలా పుణికిపుచ్చుకోలేదని సన్నిహితులు పేర్కొంటారు. ఇక.. సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా ద్రావిడ రాజకీయాలకు కాస్త భిన్నమైన సైద్ధాంతిక దృక్పథాన్ని కలిగి ఉంటారు. స్వయానా… మహా అవతార్ బాబాజీ భక్తుడు రజనీకాంత్. ఇప్పటికీ హిమాలయాలకు వెళ్ళి… బాబాజీ గుహలో తపస్సు చేసుకుంటారని, బాబాజీ నేరుగా మాట్లాడతారని ప్రచారమూ ఉంది. తాను ఆధ్యాత్మిక రాజకీయాలు చేస్తానని స్వయంగా రజనీకాంతే ప్రకటించారు. దీంతో అటు రజనీకాంత్, ఇటు అళగిరి… పొత్తు పెట్టుకొని, డీఎంకే ఓట్లను చీల్చుతారని, అది కాస్త బీజేపీకి లాభం చేకూర్చే సంకేతాలు కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.













