జానాభా పెరుగుదలకు అఖిలేశ్ రియాక్షన్.. ప్రభుత్వంపై మండిపాటు
జనాభా పరంగా చైనాను భారత్ దాటడంపై మాజీ ముఖ్యమంత్రి, సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ స్పందించారు. భారత్లో జనాభా ఈ స్థాయిలో పెరగడం ప్రభుత్వ వైఫల్యంగా ఆయన అభివర్ణించారు. రెండు రోజుల క్రితం ఐక్యరాజ్యసమితి విడుదల చేసిన లెక్కల ప్రకారం.. భారత జనాభా 142.86 కోట్లకు చేరింది. ఇది చైనా జనాభా 142.56 కోట్ల కంటే ఎక్కువ. దీంతో ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న దేశంగా భారత్ అవతరించింది. దీనిపై ట్విటర్ వేదికగా స్పందించిన అఖిలేశ్ యాదవ్.. ఇది ఆందోళనకరమైన అంశమని, ప్రభుత్వ వైఫల్యమే దీనికి కారణమని విమర్శించారు.
‘పేదరికం, నిరుద్యోగంతో బాధపడుతున్న కుటుంబాలు ఆర్థికంగా చేయూత కోసం ఎక్కువ మంది పిల్లలను కంటున్నారు. వైద్య సదుపాయాల కొరత కూడా భారత్లో ఎక్కువగా ఉంది. అందుకే పుట్టిన పిల్లలు చనిపోతారేమోననే భయంతో ఎక్కువమందిని కంటున్నారు. గర్భనిరోధక విధానాల అమలులో కూడా ప్రభుత్వం విఫలమైంది. ఎక్కువమంది ప్రజలు విద్యకు దూరంగా ఉండడం వల్ల అధిక జనాభా వల్ల కలిగే నష్టాలు తెలుసుకోలేకపోతున్నారు’ అంటూ అఖిలేశ్ తన ట్వీట్లో పేర్కొన్నారు.













