పన్నీర్ సెల్వంకు ఊరట… పళనిస్వామికి ఎదురుదెబ్బ
అన్నాడీఎంకేలో ఏకనాయకత్వ వ్యవహారంలో పళనిస్వామికి ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఆయన ఎన్నిక చెల్లదని స్పష్టం చేసింది. ద్వంద్వ నాయకత్వ విధానాన్ని కొనసాగించాలని మద్రాస్ హైకోర్టు తీర్పునిచ్చింది. పార్టీ నుంచి బహిష్కరణకు గురైన పన్నీర్ సెల్వంకు ఈ తీర్పు ఊరటనివ్వనుంది. ఆయనకు అనుకూలంగా మద్రాస్ హైకోర్టు తీర్పు ఇచ్చింది. జూన్ 23 నాటి యధాతథ స్థితిని కొనసాగించాలని తెలిపింది. కో ఆర్డినేటర్, జాయింట్ కో ఆర్డినేటర్ ఇద్దరి అనుమతి లేకుండా అన్నాడీఎంకే సాధారణ కౌన్సిల్ సమావేశం నిర్వహించడాన్ని తప్పుపట్టింది. ఏఐఏడీఎంకే జనరల్ కౌన్సిల్ సమావేశాన్ని తిరిగి నిర్వహించాలని న్యాయమూర్తి జి జయచంద్రన్ ఆదేశించారు.
పార్టీ పగ్గాల కోసం పళనిస్వామి, ఓ పన్నీర్ సెల్వం మధ్య తీవ్ర స్థాయిలో పోరు జరిగింది. చివరకు నెగ్గిన మాజీ సీఎం పళనిస్వామి. కొద్ది వారాల క్రితం జరిగిన పార్టీ సర్వసభ్య సమావేశంలో తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత అన్నాడీఎంకే సమన్వయకర్తల పదవులను రద్దు చేయడంతో పాటు పన్నీర్ సెల్వం, ఆయన మద్దతుదారులను పార్టీ నుంచి బహిష్కరిస్తూ ప్రత్యేక తీర్మానం ఆమోదించారు. ఈ పరిణామాలపై పన్నీర్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు.













