ఇక ఈ-పార్లమెంట్ సమావేశాలు?
దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతున్న నేపథ్యంలో రానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్ని ఎలా నిర్వహించాలన్న అంశంపై సమాలోచనలు మొదలయ్యాయి. సాధారణంగా జూలై-ఆగస్టులో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరుగుతాయి. అయితే ఓ వైపు కరోనా వైరస్ ఉథ్రుతి కొనసాగుతూనే ఉంది. ఈ వైరస్ వ్యాప్తి రానున్న ఒకటి రెండు నెలల్లో మరింత అధికంగా ఉండొచ్చునని అంచనాలు వెలువడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పార్లమెంట్ సమావేశాలు సాధారణ రీతిలో జరపడం సబబేనా అనే చర్చ కొనసాగుతోంది. ఎప్పటిలా కాకుండా వర్చువల్ సాంకేతికత సాయంతో ‘ఈ-పార్లమెంట్’ను నిర్వహిస్తే ఎలా ఉంటుంది? దీని సాధ్యాసాధ్యాల గురించి చర్చ కొనసాగుతోంది.
ఈ నేపధ్యంలో రాజ్యసభ చైర్మన్ ఎం వెంకయ్యనాయుడు, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా తాజాగా జరిగిన సమావేశంలో ఇదే విషయాన్ని లోతుగా చర్చించినట్టు అధికార వర్గాలు తెలిపాయి. వైరస్ కేసులు క్రమంగా పెరుగుతున్న క్రమంలో ఎప్పటి మాదిరిగా సాధారణ సమావేశాలు సాధ్యంకాకపోవచ్చని, ప్రస్తుత పరిస్థితిలో కొత్తరకం సాంకేతికతను అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఏర్పడిందని వాళ్లు అభిప్రాయం వ్యక్తం చేసినట్టు వెల్లడించాయి. దీంతో పాటు సభ్యుల మధ్య భౌతిక దూరం పాటిస్తూ పార్లమెంట్ సెంట్రల్ హాల్లోనే రెండు సభల్ని రోజు విడిచి రోజు నిర్వహించే అవకాశాన్ని కూడా చైర్మన్, స్పీకర్.. భేటీలో చర్చించినట్టు అధికార వర్గాలు పేర్కొన్నాయి.













