ఆక్సిజన్ అందక 22 మంది మృతి
మహారాష్ట్రలోని నాసిక్‌లో ఘోర ప్రమాదం జరిగింది. జాకీర్ హుస్సేన్ ఆస్పత్రి వద్ద ఆక్సిజన్ ట్యాంకర్ లీకైంది. ఆక్సిజన్ ట్యాంకర్ల నుంచి సిలిండర్లలో ఆక్సిజన్ నింపే సమయంలో భారీగా ఆక్సిజన్ లీకైంది. దీంతో పరిసర ప్రాంతాలు ఆక్సిజన్ పొగతో దట్టంగా అలుముకున్నాయి. ఇదే ఆస్పత్రిలో కరోనా రోగులు చికిత్స తీసుకుంటున్నారు. దీంతో వారికి ఆక్సిజన్ అందలేదు. ఆక్సిజన్ అందక 22 మంది మృతి చెందారు. దాదాపు 150 మంది రోగులు ఇదే ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై ఉన్నారు. వీరందరికీ ఆక్సిజన్ 30 నిమిషాల పాటు ఆగిపోయింది. ఈ క్రమంలోనే వెంటిలేటర్‌పై ఉన్న 22 మంది రోగులు ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 30 నిమిషాల పాటు ఆస్పత్రిలో ఆక్సిజన్ సరఫరా నిలిచిపోయిందని, దీంతో వెంటిలేటర్‌పై ఉన్న 22 మంది ప్రాణాలు కోల్పోయారని రాష్ట్ర ఆరోగ్య మంత్రి రాజేశ్ తోపే ప్రకటించారు. ఈ ఘటనపై దర్యాప్తుకు ఆదేశించామని ఆయన ప్రకటించారు. ట్యాంకర్ వాల్ లీక్ అయినందు వల్ల పెద్ద మొత్తంలో ఆక్సిజన్ లీక్ అయిందని, దీని ప్రభావం ఆస్పత్రిపై కూడా ఉండే అవకాశం ఉందని రాజేశ్ తోపే పేర్కొన్నారు. దీనిపై ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కూడా స్పందించారు. ఇదో భయానక ఘటన అని అభివర్ణించారు. ఈ ఆస్పత్రిలో ఉన్న రోగులను వెంటనే ఇతర ఆస్పత్రులకు పంపించాలని, ఈ ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టాలని ఫడ్నవీస్ డిమాండ్ చేశారు.
విచారం వ్యక్తం చేసిన మోదీ, అమిత్‌షా
నాసిక్‌లో ఆక్సిజన్ ట్యాంక్ లీకేజ్‌పై ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. అదో విషాదకరమైన ఘటన అని పేర్కొన్నారు. హృదయం ఎంతో కలిచివేసిందన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మరోవైపు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా కూడా సానుభూతి తెలిపారు. ఈ ఘటన ఎంతో కలిచివేసిందన్నారు. అత్యంత ఆత్మీయులను కోల్పోవడం వల్ల జరిగిన నష్టాన్ని ఎన్నటికీ పూడ్చలేమన్నారు.













