110 శాతం గెలుపు మాదే.. 221 సీట్లు గెలవడం ఖాయం : సీఎం మమత
బెంగాల్ ఎన్నికలు దగ్గర పడుతున్నా కొద్దీ రాజకీయ విమర్శలు మరింత వేడెక్కుతున్నాయి. ఇప్పటికే తృణమూల్ వర్సెస్ బీజేపీగా రాజకీయ ముఖచిత్రం మారిపోయింది. ఈ నేపథ్యంలో ఓ జాతీయ ఛానల్ నిర్వహించిన డిబేట్లో సీఎం మమత బెనర్జీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… వచ్చే ఎన్నికల్లో 110 శాతం గెలుపు తమదేనని ధీమాగా ప్రకటించారు. అంతేకాకుండా 221 సీట్లను సాధించి తీరుతామని స్పష్టం చేశారు. మునుపటి ఎన్నికలకూ, ఈ ఎన్నికలకూ ఎలాంటి వ్యత్యాసమూ లేదని, ఆ ఎన్నికలను ఎలాగైతే ఎదుర్కొన్నామో, ఈ ఎన్నికలనూ అలాగే ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. గెలుస్తామన్న ధీమాతోనే ప్రచారం నిర్వహిస్తున్నాం కాబట్టి, భయపడే ప్రసక్తే లేదని, తాను ముందు నుంచీ స్ట్రీట్ ఫైటర్నేనని చెప్పుకొచ్చారు. పోరాటం అనేది ప్రతిరోజూ చేస్తూనే ఉంటానని, అందుకే అది ప్రతిరోజూ, నిరంతరం జరిగే ప్రక్రియే అని పేర్కొన్నారు.
ఎవరైతే గూండాగిరీ చేస్తారో వారు ‘అవతలి వ్యక్తులే’
బీజేపీని ప్రతిసారి ‘అవుట్ సైడర్’ అని ఎందుకు పిలుస్తున్నామన్న దానిపై సీఎం మమత వివరణ ఇచ్చారు. ఎవరైతే గూండాగిరీ చేస్తారో వారే అవుట్ సైడర్స్ అని పేర్కొన్నారు. బెంగాల్లో అన్ని ప్రాంతాల వారూ నివసిస్తుంటారని, కానీ గూండాగిరి చేసేవారు మాత్రం బయటే ఉండాలని స్పష్టం చేశారు. ‘‘గూండాగిరీ చేయడానికి బెంగాల్‌కు వచ్చేవారు అవుట్ సైడర్స్. లేదంటే భారతీయుల్నే నేనెందుకు అంటాను? ఇతర ప్రాంతాల వారూ మా రాష్ట్రంలో ఉన్నారు? వారికేమైనా ఇబ్బందులు తలెత్తాయా? ఒక్కసారి అడగండి?’’ అని సూటిగా ప్రశ్నించారు.
ఆ ఇద్దరే దేశాన్ని ఏలుతున్నారు…
మోదీ, అమిత్‌షాయే దేశాన్ని ఏలుతున్నారని మమత విరుచుకుపడ్డారు. ప్రతి ఒక్కర్నీ ఇబ్బందిపెట్టడానికి ప్రయత్నిస్తున్నారని ఆమె ఆరోపించారు. వారు చెప్పిందే శాసనంగా చెలామణి అవుతోందని విరుచుకుపడ్డారు. ‘‘నేను చాలా ప్రభుత్వాలనే చూశా. కానీ ఇలాంటి ప్రభుత్వాన్ని మాత్రం ఎప్పుడూ చూడలేదు. బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్నాను. ద్వేష రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నాను.’’అని మమత పేర్కొన్నారు.
కులం, మతం ఆధారంగా బీజేపీ అసెంబ్లీలో గెలవాలని చూస్తోందని మమత మండిపడ్డారు. ఇలాంటి రాజకీయాలు బెంగాల్లో ఎన్నడూ లేవని, బీజేపీ వచ్చిన తర్వాతే ప్రారంభమైందని మండిపడ్డారు. మొదట్లో మతం ఆధారంగా రాజకీయాలను నెరపారని, ఆ తర్వాత హిందూ వర్సెస్ హిందూగా నడుపుతున్నారని ధ్వజమెత్తారు. బెంగాలీలను కూడా విభజిస్తున్నారని, బంగ్లాదేశీ బెంగాలీలు అని, ఇండియా బెంగాలీలు అని పిలుస్తున్నారని, స్థానికంగా అందరికీ ఒక భాష ఉంటుందని, దాని ప్రకారమే తాము మాట్లాడతామని ఆమె స్పష్టం చేశారు. అభివృద్ధి కేంద్రంగా రాజకీయాలు చేస్తే ఓడిపోతామని బీజేపీ వారికి బాగా తెలుసని, అందుకే ఇలాంటి రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.
అమిత్‌షా బెంగాల్ పర్యటనపై…
ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఈ మధ్య తరుచుగా బెంగాల్లో పర్యటిస్తున్నారు. అయితే ఈ పర్యటనపై మమత బెనర్జీ స్పందించారు. షా బెంగాల్ పర్యటనపై తానేమీ అనలేనని, బెంగాల్లో పర్యటించే హక్కు, మాట్లాడే హక్కు ఆయనకు ఉందని ఆమె స్పష్టం చేశారు. ‘‘షా పర్యటనపై నేనేమీ మాట్లాడను. పర్యటించే హక్కు, మాట్లాడే హక్కు ఆయనకు ఉంటుంది. నేనేమీ మాట్లాడను. నేను లక్ష్మణ రేఖ దాటి ప్రవర్తించను. కానీ ఆయన చేస్తుందేమి? అందర్నీ భయపెట్టిస్తున్నారు. నేనేమైనా వారికి బానిసనా? నేనేమైనా సర్వెంట్నా?’’ అని మమత అగ్గిమీద గుగ్గిలమయ్యారు.
ఎన్నికల ముందు ఇతర పార్టీల్లో చేరడం సాధారణంగా చూడాల్సిన అంశమేనని మమత పేర్కొన్నారు. కొందరు పార్టీ నుంచి బయటికి వెళ్లిపోవడమే మంచిదని, దీంతో తాము తెలుపు వర్ణంతో మెరిసిపోతున్నామని తెలిపారు. సుబేందు లాంటి కీలక నేత ఇటీవల బీజేపీలో చేరిన నేపథ్యంలో ఆమె పై వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఓ వాషింగ్ మెషిన్ అని, అందులోకి వెళ్లిన వారు నలుపు వర్ణం నుంచి తెలుపు వర్ణంలోకి మారిపోతారని ఎద్దేవా చేశారు.













