Social Media: వ్యూస్ కోసం కన్నప్రేమనే మరిచిన తల్లి.. బావి గట్టుపై పిల్లల ప్రాణాలతో చెలగాటం!
Social Media: సోషల్ మీడియాలో లైకులు, వ్యూస్ కోసం జనం ప్రాణాలకు తెగిస్తున్నారు. తాజాగా ఓ మహిళ చేసిన వెర్రి పని సోషల్ మీడియాలో తీవ్ర దుమారాన్ని రేపుతోంది. తన ఇద్దరు చిన్న పిల్లల ప్రాణాలను పణంగా పెట్టి, ఒక బావి గట్టుపై నిలబడి ఆమె చేసిన డాన్స్ వీడియో ఇప్పుడు సర్వత్రా విమర్శలకు దారితీస్తోంది.
అసలేం జరిగింది?
వైరల్ అవుతున్న ఈ వీడియోలో, ఒక మహిళ తన ఇద్దరు పిల్లలను తీసుకుని లోతైన బావిపై ఉన్న ఇరుకైన గట్టుపై నిల్చుంది. అక్కడ నిలబడటమే ప్రమాదకరం అనుకుంటే, ఆమె ఏమాత్రం భయం లేకుండా వెకిలి నవ్వులు నవ్వుతూ డాన్స్ చేయడం మొదలుపెట్టింది. అంతటితో ఆగకుండా, వీడియో కోసం తన పిల్లలను బావిలోకి పడేస్తున్నట్లు నటిస్తూ భయపెట్టింది.
గాయపడినా వదలని రీల్స్ పిచ్చి:
ఈ ప్రమాదకర విన్యాసాల క్రమంలో ఒక బిడ్డకు గాయమైంది. ఆ చిన్నారి నొప్పితో ఇబ్బంది పడుతున్నా, ఆ తల్లి మాత్రం కనీసం పట్టించుకోలేదు. బిడ్డ ఏడుస్తున్నా లెక్కచేయకుండా, కెమెరా వైపు చూస్తూ స్టెప్పులు వేయడానికే ప్రాధాన్యత ఇచ్చింది. ఆమె ప్రవర్తన చూస్తుంటే రీల్స్ పిచ్చిలో పడి కన్నప్రేమను కూడా మర్చిపోయిందని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ వీడియో కాస్తా వైరల్ కావడంతో నెటిజన్లు ఆమెపై మండిపడుతున్నారు. “కేవలం కొన్ని వ్యూస్ కోసం పిల్లల ప్రాణాలతో చెలగాటమాడతారా?” అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి బాధ్యతారాహిత్యమైన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని, పిల్లల భద్రత దృష్ట్యా పోలీసులకు ట్యాగ్ చేస్తూ నెటిజన్లు విజ్ఞప్తి చేస్తున్నారు.
సోషల్ మీడియా కీర్తి కోసం ప్రాణాలను రిస్క్‌లో పెట్టడం ఎంతవరకు సమంజసం అనే చర్చ మరోసారి మొదలైంది. పిల్లలకు రక్షణగా ఉండాల్సిన తల్లే ఇలాంటి పనులు చేయడం అందరినీ షాక్‌కు గురిచేస్తోంది. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియనప్పటికి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.













