చరిత్ర సృష్టించిన చెక్ చిన్నారి జారా .. నాలుగేళ్లకే
చెక్ రిపబ్లిక్కు చెందిన జారా అనే బాలిక సరికొత్త చరిత్ర సృష్టించింది. నాలుగేళ్ల చిరు ప్రాయంలోనే ఏకంగా ఎవరెస్ట్ బేస్‌క్యాంప్ ఎక్కేసింది. అక్కడికి చేరుకున్న అత్యంత పిన్న వయస్కురాలిగా రికార్డు నెలకొల్పింది. చెక్ దేశస్థురాలైనప్పటికీ జారా తన కుటుంబంతో కలిసి మలేసియాలో ఉంటోంది. ఇటీవల ఆమె తన తండ్రి డేవిడ్ సిఫ్రా, ఏడేళ్ల సోదరుడితో కలిసి ఎవరెస్ట్ బేస్‌క్యాంప్ వద్దకు చేరుకుంది. చిన్నారి జారా ఎప్పుడూ వేన్నీళ్లతో స్నానం చేయదు. మంచు ముక్కలతో ఆడుకుంటుంది. అందుకేనేమో ఎవరెస్ట్‌ను అధిరోహించడంలో ఆమె ఇబ్బందులేవీ ఎదుర్కో లేదు. కొన్నిసార్లు మిగతా ట్రెక్కర్ల కంటే వేగంగా ముందుకెళ్లింది అని సామాజిక మాధ్యమాలో ఆమె కుటుంబం సభ్యులు తెలిపారు. జారాకు చిన్నప్పటి నుంచి నడవడం అంటే చాలా ఇష్టమని, రోజుకు కనీసం 5`10 కిలోమీటర్లు నడుస్తుందని తండ్రి సిఫ్రా వెల్లడించారు. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌నకు చేసే ప్రయాణంలో తీవ్ర ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉంటాయి. ఉష్ణోగ్రతలు ఒక్కోసారి 25 డిగ్రీలకు పడిపోతాయి. అలాంటి కఠిన పరిస్థితులను తట్టుకుంటూ జారా సముద్ర మట్టానికి సుమారు 17,500 అడుగుల ఎత్తులో ఉండే బేస్‌క్యాంప్ వద్దకు చేరుకుంది.













