US Embassy: టూరిస్ట్ వీసాలపై ఆంక్షలు.. ‘బర్త్ టూరిజం’పై అమెరికా ఉక్కుపాదం!
అమెరికాలో పర్యటించాలనుకునే భారతీయులకు, ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు అగ్రరాజ్యం గట్టి షాక్ ఇచ్చింది. ‘బర్త్ టూరిజం’ (Birth Tourism) అరికట్టే దిశగా డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. కేవలం తమ పిల్లలకు అమెరికా పౌరసత్వం ఇప్పించే ఉద్దేశంతోనే ఎవరైనా టూరిస్ట్ వీసాకు దరఖాస్తు చేసుకుంటున్నారని అనుమానం వస్తే, ఆ వీసాలను నిర్మొహమాటంగా తిరస్కరిస్తామని ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం (US Embassy) స్పష్టం చేసింది. సాధారణంగా అమెరికా గడ్డపై పుట్టిన పిల్లలకు అక్కడి చట్టాల ప్రకారం సహజసిద్ధంగానే పౌరసత్వం (US Citizenship) లభిస్తుంది. దీన్ని ఆసరాగా చేసుకుని చాలామంది గర్భిణీలు టూరిస్ట్ వీసాలపై అమెరికా వెళ్లి అక్కడ ప్రసవిస్తుంటారు. ఈ విధానానికి చెక్ పెట్టేందుకు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం వలస నిబంధనలను కఠినతరం చేస్తోంది. ఈ మేరకు అమెరికా ఎంబసీ (US Embassy) సోషల్ మీడియా వేదికగా ఒక ప్రకటన విడుదల చేసింది. “పిల్లలకు అమెరికా పౌరసత్వం ఇప్పించడమే ప్రాథమిక ఉద్దేశమని మా కాన్సులర్ అధికారులకు అనిపిస్తే, ఆ టూరిస్ట్ వీసా దరఖాస్తులను తిరస్కరిస్తాం. దీన్ని అనుమతించే ప్రసక్తే లేదు” అని స్పష్టం చేసింది. ఇప్పటికే అక్రమ వలసలపై దృష్టి సారించిన ట్రంప్ సర్కార్, ఇప్పుడు చట్టబద్ధమైన వీసాల దుర్వినియోగంపై కూడా నిఘా పెంచింది.






