ఓసీఐ కార్డుపై భారత్‌కు వచ్చేవారు ఇకపై…
ఓవర్సీస్ సిటిజెన్స్ ఆఫ్ ఇండియా (ఓసీఐ) కార్డులు ఉన్న భారత సంతతి, ప్రవాస భారతీయులు ఇకపై భారత్‌కు వచ్చే సమయంలో తమ పాత, రద్దైన పాస్‌పోర్ట్ లను వెంట తేవాల్సిన అవసరం లేదని అమెరికాలోని భారతీయ రాయబార కార్యాలయం ప్రకటించింది. కొత్తగా ఓసీఐ కార్డు పొందడానికి, పాతవి పునరుద్ధరించుకోవడానికి గల గడువును ఈ ఏడాది డిసెంబర్ 31 వరక పొడిగించినట్లు ఈ నెల 26న విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించింది. ఓసీఐ కార్డుపై భారత్‌కు వచ్చేవారు ఇకపై పాత పాస్‌పోర్ట్ లను తేవాల్సిన అసవరం లేదు. అదే సమయంలో కొత్త పాస్‌పోర్ట్ లను మాత్రం తప్పనిసరిగా తేవాల్సి ఉంటుంది అని స్పష్టం చేసింది.
ప్రపంచవ్యాప్తంగా ఉంటున్న భారత సంతతి ప్రజలకు ఓసీఐ కార్డులను జారీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ కార్డులు ఉన్నవారు వీసా లేకుండానే భారత్‌కు రావొచ్చు. భారతీయులకు ఉన్న అన్ని రకాల ప్రయోజనాలను దాదాపుగా పొందొచ్చు. అదే సమయంలో ఓటు వేయడానికి, ప్రభుత్వ సేవలు పొందడానికి, భారత్‌లో వ్యవసాయ భూమిని కొనుగొలు చేయడానికి మాత్రం వీలుండదు. ప్రస్తుతం అమల్లో ఉన్న ఓసీఐ నిబంధనల ప్రకారం 20 ఏళ్లలోపు వారు లేదా 50 ఏళ్లు దాటిన వారు కొత్త పాస్‌పోర్ట్ పొందిన ప్రతిసారి తమ ఓసీఐ కార్డును పునరుద్ధరించుకోవాల్సి ఉంటుంది.
ఈ ప్రకటనపై న్యూయార్క్ కు చెందిన సామాజిక కార్యకర్త ప్రేమ్ భండారీ హర్షం వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఓసీఐ కార్డుదారులకు ఈ ప్రకటన ఊరట కలిగిస్తుందని తెలిపారు. పాత పాస్‌పోర్టులు లేకపోతే ఎయిర్‌పోర్టుల నుంచి ప్రయాణికులను వెనక్కి పంపిన సందర్భాలు ఉన్నాయని గుర్తు చేశారు.













