భారత సంతతి శాస్త్రవేత్త.. అద్భుత ఆవిష్కరణ
అంగారకుడిపైకి మానవసహిత యాత్రలు నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్న నేపథ్యంలో భారత సంతతి శాస్త్రవేత్త విజయ్ రమణీ నేతృత్వంలో అమెరికా శాస్త్రవేత్తలు కీలక ఆవిష్కారం చేశారు. అరుణ గ్రహ ఉపరితలంపై లభ్యమయ్యే ఉప్పు నీటి నుంచి ఆక్సిజన్, హైడ్రోజన్ ఇంధనాన్ని సేకరించే సరికొత్త వ్యవస్థను అభివృద్ధి చేశారు. ఇది భవిష్యత్‌లో అంగారక గ్రహానికే కాగా.. సుదూర రోదసి యాత్రల తీరుతెన్నులను మార్చేస్తుందని వారు తెలిపారు. భూమి మీద సముద్రాల నుంచి ఆక్సిజన్, హైడ్రోజన్‌ను సేకరించడానికీ ఇది అక్కరకొస్తుందని పేర్కొన్నారు. అంగారకుడిపై కొంత కాలం జీవించడానికైనా వ్యోమగాములు.. ఆ గ్రహంపైనే నీరు, ఇంధనం వంటి కొన్ని అవసరాలను సమకూర్చుకోవాల్సి ఉంటుంది. వాటిని భారీ పరిమాణంలో భూమి నుంచి తరలించడం అసాధ్యం. అంగారకుడి ఉపరితలం కింద ఉన్న నీటి మడుగులు ఉన్నట్లు ఇప్పటికే వ్యోమనౌకలు నిర్ధరించాయి. మెగ్నిషియం పెరోక్లోరేట్ లవణం ఉండటం వల్ల అక్కడ ద్రవ స్థితిలోనే నీరు ఉంది. ఈ నీటిని ఒడిసిపట్టి, అవసరమైన ఇంధనాన్ని తయారు చేసే అంశంపై శాస్త్రవేత్తలు దృష్టి సారించారు.
అంగారకుడి దిశగా పయనమైన నాసా వ్యోమనౌక పర్సెవరెన్స్ లో మార్స్ ఆక్సిజన్ ఇన్ సిటు రిసోర్స్ యుటిలైజేషన్ ఎక్స్పెరిమెంట్ (మోక్సీ) అనే సాధనం ఉంది. ఇది అరుణగ్రహ వాతావరణంలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ నుంచి ఆక్సిజన్‌ను మాత్రమే ఉత్పత్తి చేస్తుంది. ఇదే పరిమాణంలో శక్తిని ఉపయోగించుకొని.. 25 రెట్లు ఎక్కువ ఆక్సిజన్‌ను తయారు చేసే మార్షియన్ బ్రైన్ ఎలక్ట్రోలైజర్‌ను విజయ్ రమణి బృందం అభివృద్ధి చేసింది. ఇది హైడ్రోజన్‌నూ ఉత్పత్తి చేస్తుంది. ఈ వాయువును తిరుగుప్రయాణంలో ఇంధనంగా వ్యోమగాములు ఉపయోగించుకోవచ్చు. ఎలక్ట్రోలైజర్ యంత్రంలో నీటి వనరును వేడి చేయడం లేదా శుద్ధి చేయడం వంటి అవసరాలు లేకుండా ప్రత్యేకంగా డిజైన్ చేశారు. మైనస్ 36 డిగ్రీల సెల్సియస్‌తో కూడిన అంగారక వాతావరణాన్ని కృత్రిమంగా సృష్టించి, ఈ యంత్రాన్ని విజయవంతంగా పరీక్షించారు.













