India-Pakistan: అణు కేంద్రాలు, ఖైదీల వివరాలు పాక్‌కు చెప్పిన భారత్
పహెల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ ఘటనలతో భారత్, పాకిస్తాన్ (India-Pakistan) మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరినప్పటికీ, ఇరు దేశాలు దశాబ్దాలుగా కొనసాగుతున్న దౌత్య సంప్రదాయాన్ని పాటించాయి. నూతన సంవత్సరం సందర్భంగా న్యూఢిల్లీ, ఇస్లామాబాద్‌లలో దౌత్య మార్గాల ద్వారా తమ తమ దేశాల్లోని అణు కేంద్రాలు, జైళ్లలో ఉన్న ఖైదీల జాబితాలను పరస్పరం మార్చుకున్నాయి. ఈ విషయాన్ని విదేశాంగ శాఖ ప్రతినిధి తాహిర్ అంద్రాబీ ధ్రువీకరించారు. ఎంతటి ఉద్రిక్త పరిస్థితులు ఉన్నా, ఇరు దేశాలు ఈ ఒప్పందాలకు కట్టుబడి ఉండటం గమనార్హం.
ముఖ్యంగా అణు కేంద్రాల వివరాల మార్పిడి అనేది 1988 డిసెంబర్ 31న కుదిరిన ద్వైపాక్షిక ఒప్పందం ఆధారంగా జరుగుతోంది. 1991 జనవరి నుంచి అమల్లోకి వచ్చిన ఈ ఒప్పందం ప్రకారం, ఒకరి అణు స్థావరాలపై (Nuclear Facilities) మరొకరు దాడులు చేసుకోకూడదు. ఈ రక్షణ చర్యలో భాగంగా ప్రతి ఏటా జనవరి 1న అణు కేంద్రాల వివరాలను పంచుకోవడం ఆనవాయితీగా వస్తోంది. అలాగే 2008 మే 21 నాటి కాన్సులర్ యాక్సెస్ ఒప్పందం ప్రకారం ఏటా జనవరి, జులై నెలల్లో ఖైదీల వివరాలను కూడా రెండు దేశాలు మార్చుకుంటాయి.
తాజాగా పాకిస్తాన్ అందించిన జాబితా ప్రకారం, ప్రస్తుతం ఆ దేశ జైళ్లలో 257 మంది భారతీయులు బందీలుగా ఉన్నారు. వీరిలో 199 మంది మత్స్యకారులు కాగా, 58 మంది సాధారణ పౌరులని అధికారులు తెలిపారు. సరిహద్దుల వద్ద పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ, ఈ ద్వైపాక్షిక ఒప్పందాలను అమలు చేయడం రెండు దేశాల (India-Pakistan) మధ్య మిగిలి ఉన్న కొద్దిపాటి దౌత్య సంబంధాలకు నిదర్శనమని చెప్పవచ్చు.






