దాన్ని వేరు కానీయం.. చైనాలో
చైనా, తైవాన్ మధ్య విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. తైవాన్ తమ దేశంలో విలీనంకాక తప్పదని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ వ్యాఖ్యానించారు. జనవరిలో ఈ ద్వీపంలో ఎన్నికలు జరగనున్న తరుణంలో జిన్‌పింగ్ నుంచి ఇటువంటి స్పందన రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. చైనాను పాలించిన మావో 130వ జయంతి సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. మాతృభూమితో పునరేకీకరణ జరగాలి. అది అనివార్యం. తైవాన్ను చైనా నుంచి వేరు కానీయం. తైవాన్ జల సంధి అంతటా శాంతియుత సంబంధాలను ప్రోత్సహించాలి అని జిన్‌పింగ్ ప్రతిజ్ఞ చేశారు. తైవాన్ విషయంలో బీజింగ్ వైఖరిని ఆయన పునరుద్ఘాటించారు. త్వరలో అక్కడ జరగబోయే ఎన్నికలు, తైవాన్‌పై బలప్రయోగం వంటి అంశాలను ఆయన ప్రస్తావించలేదు.













