అమెరికా చర్యపై మరోసారి చైనా మండిపాటు
తమ దేశానికి చెందిన వాతావరణ పరిశోధన బెలూన్ను అమెరికా కూల్చివేయడంపై చైనా మరోసారి అగ్రహం వ్యక్తం చేసింది. అమెరికా సైన్యం యుద్ధ విమానాలను ఉపయోగించి అనుమానాస్పద బెలూన్ను నిఘా బెలూన్గా భావిస్తూ కూల్చివేసిన సంగతి తెలిసిందే. ఈ చర్య విచక్షణారహితమైనదని చైనా అభివర్ణించింది. ఈ పరిణామం చైనా-అమెరికాల మధ్య నెలకొన్న అంతరాలను తొలగించేందుకు జరుగుతున్న ప్రయత్నాలను పురోగతిని ప్రభావితం చేయడంతో పాటు దెబ్బతీసిందని పేర్కొంది. ఈ ఘటనపై అమెరికా రాయబార కార్యాలయానికి ఫిర్యాదు చేసినట్లు చైనా ఉప విదేశీ వ్యవహారాల మంత్రి షీ ఫెంగ్ వెల్లడించారు. అమెరికా భూ భాగాన్ని విడిచి వెళ్లిపోతున్న వాతావరణ పరిశోధనలకు ప్రయోగించిన పౌర బెలూన్ను అంతర్జాతీయ న్యాయ సూత్రాల స్ఫూర్తిని మరిచి కూల్చివేడయం అతిగా స్పందించడమేనని పేర్కొన్నారు.













