ఈరోజు లంచ్‌కి సరికొత్తగా.. థ్రిల్ చేసే రుచితో ఇలా మినపొడి అన్నం చేసుకోండి!
ఇంట్లో ప్రతిరోజూ చేసే సాధారణ అన్నానికి కాస్త భిన్నంగా, సంప్రదాయ రుచిని ఆస్వాదించాలనుకుంటే మినపప్పు అన్నం (Urad Dal Rice) మంచి ఎంపిక. మినపప్పు, ధనియాలు, ఎండుమిర్చి, కొబ్బరితో తయారు చేసిన సువాసనగల పొడిని నెయ్యి తాలింపుతో కలిపి అన్నంలో కలపడం వల్ల ఈ వంటకం ఎంతో రుచిగా ఉంటుంది.
పెద్దగా శ్రమ లేకుండా, ఇంట్లో అందుబాటులో ఉండే పదార్థాలతోనే దీన్ని సులభంగా తయారు చేసుకోవచ్చు. పొడిపొడిగా వండిన అన్నంలో మినపప్పు పొడిని కలిపితే ఘుమఘుమలాడే మినపప్పు అన్నం సిద్ధమవుతుంది. పెరుగు, ఊరగాయ లేదా మీకు నచ్చిన సైడ్ డిష్‌తో వడ్డిస్తే మరింత రుచిగా ఉంటుంది.
మినపప్పు పొడి ఇలా తయారు చేసుకోండి

ముందుగా ఒక పాన్‌లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి వేడి చేయాలి. అందులో 1/4 కప్పు పొట్టు మినపప్పు వేసి సన్నని మంటపై మంచి సువాసన వచ్చే వరకు వేయించాలి. పప్పు చక్కగా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 8–10 ఎండుమిర్చి, 1/4 కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు వేసి ఎర్రగా వేయించుకోవాలి.
వేగిన పదార్థాలను కొద్దిసేపు చల్లారనిచ్చి మిక్సీలో వేసుకోవాలి. ఇందులో రెండు రెబ్బల చింతపండు కూడా వేసి మెత్తగా పొడి చేసుకోవాలి. ఇలా తయారైన మినపప్పు పొడిని పక్కన పెట్టుకోవాలి.
తాలింపుతో మినపప్పు పొడిని వేయించాలి

ఇప్పుడు మరోసారి పాన్‌లో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి వేడి చేయాలి. ఇందులో 1 టీస్పూన్ ఆవాలు, 1 టీస్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చి, కొద్దిగా ఇంగువ, 2 రెబ్బల కరివేపాకు వేసి తాలింపు పెట్టాలి. తాలింపు చక్కగా వేగి మంచి వాసన వచ్చే వరకు వేయించాలి.
ఇవి కూడా చదవండి
తర్వాత తయారు చేసి పెట్టుకున్న మినపప్పు పొడి, తగినంత ఉప్పు వేసి సుమారు ఒక నిమిషం పాటు కలుపుతూ వేయించాలి. ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు. ఇలా చేస్తే పొడి మరింత సువాసనగా మారుతుంది.
అన్నంలో కలిపితే ఘుమఘుమలాడే మినపప్పు అన్నం రెడీ

చివరగా ముందుగా పొడిపొడిగా వండుకుని పెట్టుకున్న ఒక కప్పు అన్నాన్ని తీసుకోవాలి. ఇందులో వేయించి సిద్ధం చేసుకున్న మినపప్పు పొడిని వేసి అన్నం మొత్తం పొడితో బాగా కలిసేలా మెల్లగా కలపాలి. అవసరాన్ని బట్టి నెయ్యి కొద్దిగా పెంచుకోవచ్చు. అంతే.. ఎంతో రుచిగా, ఘుమఘుమలాడే మినపప్పు అన్నం సిద్ధం. దీనిని వేడిగా ఉన్నప్పుడే వడ్డిస్తే రుచి మరింత బాగుంటుంది.








